ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్. టెక్నాలజీతో పాలనను బలోపేతం చేయడం, సులభంగా సేవలను అందించి ప్రజాజీవితాల్ని మెరుగుపరచాలనే చంద్రబాబు తపన, కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు బిల్‌గేట్స్ లేఖ రాశారు. ఏపీలో ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన రంగాల్లో అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి గేట్స్ ఫౌండేషన్- ఏపీ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ఎంతో మేలు చేస్తుందన్నారు
కీలక రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలు కనుగొనడం, ప్రజలకు సులభతరంగా సేవల్ని అందించే అంశాలపై ఈ ఏడాది మార్చిలో దిల్లీ వేదికగా చంద్రబాబు, బిల్‌గేట్స్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరువురి సమక్షంలో పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ నేపథ్యంలో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని చంద్రబాబును అభినందిస్తూ గేట్స్ లేఖ రాశారు. భవిష్యత్తులో ఏపీలో పర్యటించే నాటికి ఈ ఒప్పందంలోని లక్ష్యాల్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మెడ్‌టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి చంద్రబాబు చూపుతున్న శ్రద్ధతో పేదలకు అత్యంత నాణ్యత కలిగిన పరికరాలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయన్నారు.
హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, AI అసిస్టెడ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్ ద్వారా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలనే చంద్రబాబు ప్రణాళికలు ఆసక్తికరంగా అనిపించాయన్నారు బిల్‌గేట్స్. గర్భిణులు, చిన్నపిల్లల ఆరోగ్య రక్షణకు మల్టిపుల్ మైక్రోన్యూట్రియంట్ సప్లిమెంట్లు తదితరాలు ఎలా ఉపయోగపడతాయో చర్చించినందుకు ఆనందంగా ఉందన్నారు.











