కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీనెయ్యి వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం హీటెక్కింది. కల్తీనెయ్యి వివాదం జరుగుతున్న సమయంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్మించుకోవడానికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. తాను తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వెళతానని జగన్ ప్రకటించడంతో.. జగన్ తిరుమలకి వెళ్లాలంటే డిక్లరేషన్‌పై సంతకం తప్పకుండా చేయాల్సిందేనని అధికార టీడీపీతోపాటు జనసేన, బీజేపీ, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో సమస్య జఠిలం కావడంతో తన తిరుమల పర్యటనను జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు, హిందూవాదులు డిక్లరేషన్‌పై సంతకం చేయడానికి ఇష్టం లేకనే జగన్ తన పర్యటనను విరమించుకున్నారని విమర్శించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వాడారనే ప్రచారం నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. 11 రోజులపాటు దీక్షను నిర్వహించిన పవన్.. అక్టోబర్ 2న తిరుమలలో దీక్షను విరమించారు. పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు దీక్షను నిర్వహించి.. తిరుమల మెట్టమార్గంలో కాలినడకన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో తనతోపాటు తన ఇద్దరు కుమార్తెలు కూడా తన వెంట తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చిన్న కుమార్తె పలీనా అంజనా కొణిదెల డిక్లరేషన్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజలి క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ సంతకం చేశారు. పలీనా అంజలి మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. మంగళవారమే కాలిబాటన తిరుమలకు వచ్చిన పవన్.. బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి తిరుమలకు వచ్చారు.
ఏపీ రాజకీయాల్లో కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం డిక్లరేషన్ వ్యవహారంపై చర్చ జరుగుతోది. ఇప్పుడు పలీనా అంజలి డిక్లరేషన్‌పై సంతకం చేయడం.. తను మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్‌పై సంతకం చేయడంతో ఈ అంశం మరోసారి తెర మీదికి వచ్చింది. తండ్రి పవన్ కల్యాణ్, అక్క ఆద్యతో కలిసి శ్రీవారి దర్శనం కోసం పలీనా మంగళవారం రాత్రే తిరుమలకు వచ్చారు. పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. దర్శనానికి వెళ్లడానికి ముందు ఆమె టీటీడీ అధికారులు ఇచ్చిన డిక్లరేషన్‌పై సంతకం చేశారు.
పలీనా అంజన మైనర్ కావడంతో ఆమెతో పాటు ఆ డిక్లరేషన్ ఫామ్‌పై తండ్రిగా పవన్ కల్యాణ్ కూడా సంతకం చేశారు. అంజన.. తల్లి అన్నా లెజినోవా తరఫు నుంచి క్రైస్తవ మత సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. గతంలో బాప్టిజాన్ని స్వీకరించారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ సైతం ఒకట్రెండు సందర్భాల్లో బాహటంగా వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన హైందవేతరులు, అన్యమతస్తులు డిక్లరేషన్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అన్యమతంలో ఉన్నప్పటికీ- శ్రీవేకంటేశ్వర స్వామివారి మీద తనకు అపార భక్తి విశ్వాసాలు ఉన్నాయని, అందువల్లే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చానంటూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
అందుకోసమే పలీనా అంజన డిక్లరేషన్‌ను ఇచ్చారు. అయితే భవిష్యత్‌లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ.. వారి కుమార్తెలు గానీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఇలాగే డిక్లరేషన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తారా? వస్తే.. వారు డిక్లరేషన్ ఇస్తారా? అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.