ఏపీ పురోగతి లక్ష్యంగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతోంది. గత ఐదేళ్ల నుంచి మరుగుతున్న పడ్డ రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా, అదే సమయంలో 7.75 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీని ప్రభుత్వం తయారు చేసింది. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయో ఫ్యూయల్, పీఎస్‌పీ, హైబ్రిడ్ ప్రాజెక్ట్ లు.. సోలార్ పార్కులు, తయారీ యూనిట్ల ఏర్పాటు కోసం ఒకే పాలసీని తీసుకువస్తోంది.
ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదాను కల్పించనున్నారు. భవిష్యత్తును ఏలనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడంతో పాటు.. ఇంటర్నేషనల్ ఇన్‌వెస్ట్‌మెంట్ లు లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీని తయారు చేసింది. అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎలక్ట్రోలైజర్ మాన్యుఫాక్చరింగ్, బయో ఫ్యూయల్, బ్యాటరీ స్టోరేజి, పీఎస్పీ ప్రాజెక్టులను ప్రోత్సహించేలా ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలను కొనసాగిస్తూనే.. కొత్తగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇవ్వబోతుంది. తద్వారా రాష్ట్ర డిమాండ్‌లో పునరుత్పాదక విద్యుత్ వాటాను గణనీయంగా పెంచడం ద్వారా విద్యుత్ సేకరణ ఖర్చును తగ్గించే లక్ష్యంతో నూతన పాలసీని ప్రభుత్వం రెడీ చేసింది.
పైగా రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు బ్యాంకింగ్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ విద్యుత్‌ను తిరిగి వాడుకునేందుకు నిబంధనలను చేర్చారు. ఇంకా రాష్ట్రంలో కొత్తగా పునరుత్పాదక తయారీ జోన్‌లను (ఆర్‌ఈఎంజడ్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ప్రైవేటు రంగంలో ప్రాజెక్టులు ఏర్పాటుచేసే వారికి ఆర్‌ఈఎంజడ్‌లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. జియో థర్మల్, టైడల్, ఓషియన్ ఎనర్జీస్, బయో ఫ్యూయల్, బయోగ్యాస్, ఇథనాల్ మిశ్రమం, స్టోరేజి, కార్బన్ క్యాప్చర్ వంటి ఇన్నోవేటివ్ ఆర్‌ఈ టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వయబులిటీ గ్యాప్ ఫండ్/క్యాపిటల్ సబ్సిడీ కింద 20% మొత్తాన్ని పైలట్ ప్రాజెక్టులకు అందిస్తుంది.
ప్రాజెక్టులకు లీజు విధానంలో భూములు.. ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సేకరించిన భూములకు ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు.. రెండేళ్లకు 5 శాతం చొప్పున పెంచనున్నారు. రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులకు 5 కిలోవాట్ల వరకు ఫీజు లేదు. 100 కిలోవాట్లకు రూ.వెయ్యి, వెయ్యి కిలోవాట్లకు రూ.10వేలు, అంతకుమించి ఏర్పాటుచేసే ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ.25వేలు నెడ్‌క్యాప్ వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయాలు అన్నీ సాధారణ ప్రజలకు కాస్త ఆశ్చర్యకరం అనిపించినప్పటికీ చంద్రబాబు విజన్ 2047 కు బాటలు వేయనున్నాయి.










