పిలిచి అవమానిస్తున్నారే కానీ.. సమస్యలను పరిష్కరించడం లేదు!
ఏపీలో 13 లక్షల మంది ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు.. గాల్లో దీపాలయ్యాయి. జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు నమ్మి.. ఓట్లేసిన పాపానికి గంటె కాల్చివాత పెట్టారని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. జాయింట్ స్టాప్ కౌన్సిల్ మీటింగ్స్ అంటూ సచివాలయానికి జేఏసీ నేతలను పిలువడం.. ఉద్యోగుల సమస్యలపై చర్చిచకుండా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి తిరిగి పంపడం ప్రభుత్వం పనిగా పెట్టకుందని జేఏసీ ప్రతినిధులు మండిపడుతున్నారు. 71 డిమాండ్స్ ను అత్యవసరంగా నెరవేర్చాల్సినవిగా ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు విన్నవిస్తున్నా.. వాటిని పెడచెవిన పెట్టి చిన్నచూపుచూస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. మొక్కుబడిగా భేటీలకు పిలుస్తున్నారని, అధికారులు తమను అవమానిస్తున్నారని మండిపడుతున్నారు.
సీఎంతో కలవనీయకుండా అడ్డుపడుతున్నారు..!
ఉద్యోగుల బకాయిలు రూ.1600 కోట్ల నుంచి 2100 కోట్లుకు పెరిగిందని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వాపోయ్యారు. మార్చిలోపు బకాయిల కిందా రూ.100 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతునే రూ. 2,000 కోట్ల బిల్లులు వెనక్కిపంపాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర కార్యవర్గ భేటి జరిపి ఈ నెల 9 నుంచి ఉద్యమాన్ని ఇక ఉధృతం చేయనున్నట్లు బొప్పరాజు వివరించారు. తాము ఫ్రెండ్లీ ప్రభుత్వంగానే భావిస్తున్నామని.. కానీ ప్రభుత్వం మాత్రం తమపై వివక్ష చూపిస్తున్నట్లు బండి శ్రీనివాస్ అవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు తోపాటు మరో 69 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ పై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వలేదని వాపోయ్యారు. తమను సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలవనీయకుండా సజ్జల, ఆర్థిక మంత్రి బుగ్గన, సీఎస్ అడ్డుపడుతున్నారని బండి ఆరోపించారు.











