‘దృశ్యం’ మలయాళ చిత్రం… సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లోనూ రీమేక్ అవడంతో పాటు నార్త్ లోనూ, విదేశాల్లో సైతం రీమేక్ అయి.. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. మధ్య తరగతి కుటుంబీకుడు జార్జ్ కుట్టిగా కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ అసాధారణ నటన ఈ సినిమాని బెస్ట్ థ్రిల్లర్ మూవీగా నిలిబెట్టింది. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కింది. అదే దర్శకుడు జీతు జోసెఫ్ .. మలిచిన ఈ సీక్వెల్ మూవీ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. మరి ఈ సినిమా మొదటి భాగంలాగానే మ్యాజిక్ చేస్తుందా? ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం..
కథేంటి?
తన కుటుంబం చేతిలో హత్యచేయబడ్డ వరుణ్ మృతదేహాన్ని తన భార్యకు సైతం తెలియకుండా.. నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ కింద పాతిపెట్టిన జార్జ్ కుట్టి (మోహన్ లాల్) ఈ కేసు నుంచి తెలివిగా బైటపడి.. తన కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తుంటాడు. కేబుల్ ఆపరేటర్ స్థాయి నుంచి ఒక సినిమా థియేటర్ కు ఓనర్ అవుతాడు. అయితే ఆ కేసు లో జార్జ్ కుట్టి తెలివి ముందు ఓడిపోయిన పోలీసులు మాత్రం ఈ కేసు ను అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఆరేళ్ళ కాలం పాటు .. ఆ కేసు ను రహస్యంగా ఇన్వెస్ట్ గేట్ చేస్తునే ఉంటారు. ఆ క్రమంలో పోలీసులకు కీలకమైన ఆధారాలు దొరుకుతాయి. దాని వల్ల జార్జ్ కుట్టి కుటుంబం మళ్ళీ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కుతుంది. చివరికి ఏం జరుగుతుంది? అన్నదే మిగతా కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
తమిళ, తెలుగు భాషల్లో సీక్వెల్స్ అంతగా ఆడిన దాఖలాలు లేవు. కానీ.. మలయాళంలో మాత్రం చాలా సీక్వెల్స్ .. మొదటి భాగాన్ని మించి మ్యాజిక్ చేశాయి. ముఖ్యంగా మోహన్ లాల్, మమ్ముట్టి బ్లాక్ బస్టర్ అయిన ఎన్నో మూవీస్ .. సీక్వెల్స్ గా తెరకెక్కి ఘన విజయం సాధించాయి. ఆ జాబితాలోకి చేర్చాల్సిన మరో సీక్వెల్ మూవీ ‘దృశ్యం 2’ . లాక్ డౌన్ కాలంలో షూటింగ్ మొదలుపెట్టి.. కేవలం 47రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసిన ఈ సినిమాపై అందరికీ సందేహాలు తలెత్తాయి. కోవిడ్ కాలంలోనే చిత్రీకరణ ప్రారంభించి.. పూర్తి చేసిన ఈ సినిమా.. మొదటి భాగాన్ని మించిన స్థాయిలో ఆడుతుందా లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే.. కనీసం పాస్ మార్కులయినా వేయించుకుంటుందా అని అనుకున్నారు చాలా మంది. అలా అని.. మోహన్ లాల్ నటనా సామర్ధ్యం, దర్శకుడు జీతూ జోసెఫ్ బ్రిలియన్సీ ని మాత్రం ఎవరూ తేలిగ్గా తీసుకోలేకపోయారు.
సినిమా బిగినింగ్ లో స్లో నెరేషన్ తో .. మామూలు సినిమాగా అనిపించిన సినిమా.. రాను రాను .. మనల్ని కథలో లీనం చేయించేస్తుంది. ఆశ్చర్యం గొలిపే రీతిలో కొన్ని సన్నివేశాలు కట్టి పడేస్తాయి. జార్జ్ కుట్టి శవాన్ని పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టాడన్న నిజం పోలీసులకు తెలిసిపోతుంది. వరుణ్ తల్లి దండ్రులు ఆ శవాన్ని వెలికి తీయించి.. ఫోరెన్సిక్ పరిశోధనలకు పంపిస్తారు. జార్జ్ కుట్టి కుటుంబం మొత్తాన్ని కటకటాల వెనక్కి పంపించేంత కసితో రగిలిపోతుంది వరుణ్ తల్లి. కానీ అతడు వరుణ్ ను తనే చంపానని తల వెనక ఒక ఇనుప రాడ్డుతో కొట్టడం వల్ల అతడు చనిపోయాడని .. అతడి చొక్కా , హత్య చేసిన ఆయుధం కూడా సబ్ మిట్ చేస్తానని .. తన కుటుంబాన్ని మాత్రం ఏమీ చేయొద్దని ప్రాధేయపడతాడు. దాంతో అతడ్ని జ్యూడిషియల్ కస్టడీకి పంపించి.. ఆ తర్వాత అతడ్ని అరెస్ట్ చేయాలని నిర్ణయించుకుంటారు. అయితే కథ ఇంత సింపుల్ గా తేలిపోయిందేంటి? అతడు పోలీసులకు లొంగిపోతే .. ఇక కథేం ఉంటుందని అనిపిస్తుంది. అయితే అందరి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ.. అక్కడ నుంచి జార్జ్ కుట్టి అసలైన గేమ్ మొదలు పెడతాడు.
ఆ తర్వాత ఎవరూ నమ్మశక్యం కాని రీతిలోని సన్నివేశాలు .. ట్విస్ట్ లు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అక్కడే దర్శకుడి బ్రిలియన్సీ కనిపిస్తుంది. జార్జ్ కుట్టి తెలివితేటలకు షాకవడం పోలీస్ వంతవుతుంది. అతడ్ని కటకటాల వెనక్కి పంపించి.. తన కక్ష తీర్చుకోవాలనుకున్న వరుణ్ తల్లికి మళ్ళీ తీవ్ర నిరాశ ఎదురవుతుంది. ఒక దశలో పోలీసులు అతడ్ని ముట్టుకోవడానికి సాహసం చేయలేని విధంగా జార్జ్ కుట్టి పాత్ర పోలీసుల్ని తికమక పెడుతుంది. చివరికి క్లైమాక్స్ లో ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చి.. దర్శకుడు జార్జ్ కుట్టి పాత్రపై అందరికీ సానుభూతిని కలిగిస్తాడు. మొత్తం మీద పెర్ఫెక్ట్ సీక్వెల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ దృశ్యం 2. సీక్వెల్స్ తీయడానికి తడబడే దర్శకులకు .. దృశ్యం 2 ఒక గొప్ప లెసన్ అవుతుందని చప్పుకోవాలి.
హైలైట్స్ : జార్జ్ కుట్టి పోలీస్ లకు లొంగిపోయి.. కోర్ట్ లో హాజరయ్యే సన్నివేశాల దగ్గర వచ్చే ట్విస్ట్
నటీనటులు : మోహన్ లాల్, మీనా, సిద్ధిక్, ఆశాశరత్, మురళీ గోపీ, గణేశ్ కుమార్, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ తదితరులు
సంగీతం : అనిల్ జాన్సన్
ఛాయా గ్రహణం : సతీష్ కురుప్
నిర్మాణం : ఆశీర్వాదం ఫిల్మ్స్
నిర్మాత : ఆంటనీ పెరుంబావుర్
రచన, దర్శకత్వం : జీతు జోసెఫ్
ఒక్కమాటలో : ఇస్మార్ట్ థ్రిల్లర్
భాష : మలయాళం
ఎక్కడ చూడాలి : అమెజాన్ ప్రైమ్ లో
రేటింగ్ : 3.5 / 5
-ఆర్కే











