ఆక్సిజన్ ప్రెజర్ తగ్గడం వల్ల 11 మంది చనిపోయారని చిత్తూరు కలెక్టర్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై అనేక ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. కర్నూలు, అనంతపురం, హిందూపురం, విజయనగరం, రాజాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక గడచిన నెల రోజుల్లో పది మందికిపైగా కరోనా రోగులు చనిపోయినా, ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదని చెబుతూ వస్తోంది. కానీ తిరుపతి రుయా ఆసుపత్రిలో మొదటి సారిగా 11 మంది రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జరిగిన ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు.
రుయాలో అసలేం జరిగింది?
నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ప్రెజర్ తగ్గి కరోనా రోగులకు ప్రాణవాయువు అందక హాహాకారాలు చేయడం మొదలు పెట్టారు. రుయాలో అప్పటికే 700 మంది రోగులు ఆక్సిజన్ సరఫరాతో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. రుయాలో 16వేల లీటర్ల రెండు ఆక్సిజన్ ట్యాంకర్లు ఉన్నా, కనీసం వాటిని అజమాయిషీ చేసే సిబ్బంది ఒక్కరు కూడా లేకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా చెప్పవచ్చు. తమిళనాడులోని పెరంబదూరు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకరు రావడం ఆలస్యం అయిందని నెపం వారిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ట్యాంకర్లలో ఆక్సిజన్ నిల్వలు ఎంత ఉన్నాయి. అది ఎన్నిగంటలు వచ్చే అవకావం ఉంది. అప్పటికల్లా ఆక్సిజన్ ట్యాంకరు వస్తుందా? లేదా? అని పర్యవేక్షించే అధికారులు లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఆక్సిజన్ కొరత లేదని చెబుతూనే ఉంది. కానీ ఇంత మంది కరోనా రోగులు ఎందుకు చనిపోయారంటే మాత్రం, ఆక్సిజన్ ప్రెజర్ తగ్గడం వల్లేనని చెప్పుకొస్తున్నారు. ట్యాంకర్లలో ఆక్సిజన్ నిండుకోవడం వల్లే కదా ప్రెజర్ తగ్గేది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిండుకోకముందే లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లు తెప్పించి సిద్దంగా ఉంచుకోవాలి కదా? కానీ అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లాక్ డౌన్ పెట్టాలని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. రుయాలో మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే వందల సంఖ్యలో కరోనాతో చనిపోతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఆక్సిజన్ అందక జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఆయన ధ్వజమెత్తారు.
పాఠాలు నేర్వరా?
రోజుకు ఏపీలో 500 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోంది. ఈ అవసరాలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఆక్సిజన్ అవసరాలు తీర్చుకునేందుకు ఏపీ సీఎం కనీసం ప్రధానికి ఫోన్ చేసిన సందర్బం కూడా కనిపించడం లేదు. తమిళనాడులో 15 రోజుల అవసరాలకు సరిపడా ఆక్సిజన్ నిల్వ చేసుకున్నారని తెలుస్తోంది. ఇక మహారాష్ట్రలో అయితే రోజుకు 1200 టన్నుల ఆక్సిజన్ వినియోగిస్తున్నారు. కానీ అక్కడ ఆక్సిజన్ కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీలో మాత్రం అలాంటి ప్రయత్నం జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కరోనా మరణాలు ప్రభుత్వ మరణాలేనని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. కనీసం రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అత్యంత విషాదకరం : జనసేన
ప్రాణవాయువు అందక రుయా ఆసుపత్రిలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో రాజకీయ విమర్శలు చేయడం ఎందుకని ఇన్నాళ్లూ దూరంగా ఉన్నామని, కానీ ఏపీలో పరిస్థితులు చేయిదాటిపోయాయని ఆయన విమర్శించారు. కరోనా రోగులకు వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రభుత్వం తక్షణమే పరిస్థితులను చక్కదిద్దాలని జనసేనాని విజ్ఙప్తి చేశారు. రుయాలో మరణాలపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వ పనితీరును తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వం కరోనా రోగులకు వైద్యం అందించడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు.
ఇంకా ఎంత మంది చనిపోవాలి?
ఏపీలో ఆక్సిజన్ అవసరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరో వైపు ఏపీలో 500 టన్నులకు మించి ఆక్సిజన్ నిల్వ చేసుకునే సదుపాయం కూడా లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ట్యాంకరు ఖాళీ అయ్యేలోపు లారీ ట్యాంకరులో ఆక్సిజన్ రాకుంటే ఇక అంతే సంగతులు. కనీసం వారానికి సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలు చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఏ రోజుకు ఆ రోజు అన్న చందంగా ఆక్సిజన్ సరఫరా ఉంది. ఆక్సిజన్ తయారు చేసే కంపెనీల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు ట్యాంకర్లు కూడా ఇప్పటికీ సమకూర్చులోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వందలాది మంది చనిపోయాక సింగపూర్ నుంచి 20 ట్యాంకర్లు కొనుగోలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆర్డర్లు పెట్టింది. అవి ఎప్పటికి చేరుకుంటాయో కూడా అంచనా లేదు. ఆ ట్యాంకర్లు వస్తే కొంత వరకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడే అవకాశం ఉంటుందని వైద్యాధికారులు చెబుతున్నారు.











