విశాఖ, విజయవాడ వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుపై గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. విజయవాడ, విశాఖల్లో మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇవాళ టెండర్లు పిలవవనున్నారు. మొత్తం రూ.21,616 కోట్లతో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తారు. ఇందులో రూ.10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైలు, రూ.11,498 కోట్లతో విశాఖ మెట్రో రైలుకు టెండర్లు పిలుస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల నిర్మాణాలు జరగనున్నాయి. విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.4,101 కోట్లు ఇవ్వనున్నారు. VMRDA నుంచి నిధులు ఇవ్వనున్నారు. విజయవాడ మెట్రోకు CRDA నుంచి రూ. 3,497 కోట్లు ఇస్తారు.
2014 – 19 మధ్య కాలంలోనే గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేసింది. ఇందుకోసం దేశంలో మెట్రో మ్యాన్‌గా పేరున్న శ్రీధరన్ సేవలను సైతం ఉపయోగించుకుంది. ఐతే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు అటకెక్కాయి. 2019-24 మధ్య జగన్ సర్కార్ ఈ రెండు ప్రాజెక్టులను ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఏపీ వాసులకు మెట్రో ప్రాజెక్టు కలగానే మిగిలిపోయింది. దక్షిణాదిన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో మెట్రో రైలు వ్యవస్థ అందుబాటులో ఉంది. వైసీపీ నిర్లక్ష్యం వల్ల దక్షిణాదిన మెట్రో రైలు వ్యవస్థ లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫుల్ ఫోకస్ పెట్టింది.
విశాఖపట్నంలో ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఒకటో కారిడార్, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్లు 2వ కారిడార్, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కిలోమీటర్లు 3వ కారిడార్ నిర్మించనున్నారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్లు మరో కారిడార్ నిర్మించనున్నారు.
విజయవాడ మెట్రో రైల్ రెండు దశలుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో రెండు కారిడార్లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో కారిడార్ 1Aగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ, కారిడార్ 1Bగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకూ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. మొదటి దశ కారిడార్ 1A, 1B లను 38.4 కిలోమీటర్ల మేర నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించారు. ఇక రెండో దశలో నిర్మించే మూడో కారిడార్‌ను 27.5 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు.
ఇక మెట్రో ప్రాజెక్టుల టెండర్లు ఖరారైన వెంటనే పనులు కూడా స్పీడ్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విశాఖకు ప్రముఖ ఐటీ కంపెనీలు క్యూ కట్టడంతో శరవేగంతో మెట్రో ప్రాజెక్టు పనులు జరిగే ఛాన్సుంది. ఇక విజయవాడలోనూ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కితే రియల్ ఎస్టేట్ సెక్టార్ మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.











