వైసీపీ సర్కార్ 2019-24 మధ్య సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. ఆ విధ్వంసం తాలుకు గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎదురైన వేధింపులను సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికీ మరిచిపోలేదన్నారు. రాజధాని అమరావతిలో మళ్లీ స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్ రెడీగా లేదన్నారు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ని పునరుద్ధరించేందుకు, సింగపూర్‌తో మళ్లీ సత్సంబంధాలు నెలకొల్పేందుకు ఆ దేశ పర్యటనకు వెళుతున్నట్టు చెప్పారు చంద్రబాబు.
2014-19 మధ్య ఏపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి, ఉపాధి కల్పించడం ద్వారా రాజధాని అభివృద్ధికి ఆ ప్రాజెక్టు ఉత్ప్రేరకంగా పనిచేసేది. ఐతే దాన్ని జగన్ ప్రభుత్వం చెడగొట్టింది. సింగపూర్ సంస్థలపై బురద చల్లడంతో ఏపీనే అంటే వాళ్లు విరక్తి చెందారు. సింగపూర్ మొదటినుంచీ ఏపీకి స్నేహహస్తం అందించింది. రాజధానికి మాస్టర్‌ప్లాన్ ఉచితంగా ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది. శనివారం నుంచి దాదాపు ఆరు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనుంది చంద్రబాబు అండ్ టీం. ఈ బృందంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సహా పలువురు అధికారులు సింగపూర్‌కు వెళ్లనున్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీలు నిర్వహించనున్నారు. ‘బ్రాండ్ ఏపీ’ ప్రమోషన్‌తో పరిశ్రమలు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు.
ఈ పర్యటనలో దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలుత దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు…ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. ఈ నేపథ్యంలో సింగపూర్ పర్యటనలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని చంద్రబాబు టీమ్ టార్గెట్‌గా పెట్టుకుంది.











