ఏపీలో అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఇచ్చిన అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2న అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల 85 వేల 838 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది.
ఐతే ఈ పథకాన్ని 3 విడతల్లో అమలు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో రేపు రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.5 వేలు ఉండగా..పీఎం కిసాన్ కింద కేంద్రం వాటా రూ.2 వేలు రైతు ఖాతాలో పడనుంది. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 వేల 342 కోట్ల 92 లక్షలు విడుదల చేయనుంది.కేంద్ర ప్రభుత్వ వాటా రూ.831.51 కోట్లు అందించనుంది.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు రూ.6 వేల ఆర్థికసాయాన్ని అందిస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ పేరుతో మరో రూ.14 వేల రూపాయలు కలిపి అందజేయనుంది. మొదటి రెండు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల చొప్పున, మూడో విడతలో రూ.4 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇక ఈ పథకంపై ఏదైనా అనుమానాలుంటే సంప్రందించేందుకు 155251 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నదాతా సుఖీభవ పథకం అమలుపై ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు పంపారు సీఎం చంద్రబాబు. అన్నదాతా సుఖీభవ అందుకునే రైతుల సెల్‌ఫోన్లకు ఒకరోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సందేశాలు వెళ్లాలన్నారు. ఖాతాలు యాక్టివేట్ చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వస్తోంది కూటమి సర్కార్. ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసింది. స్కూల్‌కు వెళ్లే చిన్నారుల తల్లిదండ్రుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం వర్తింపజేసింది. ఇక గతంలోనే ఉచిత సిలిండర్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టనుంది. కూటమి ప్రభుత్వం ఏడాది వ్యవధిలోనే ప్రధాన హామీలన్నింటిని పట్టాలెక్కించింది. దీంతో ప్రజలు కూటమి పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.











