ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది గూగుల్. విశాఖ కేంద్రంగా అమెరికా తర్వాత విశాఖలోనే భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. 6 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగా బైట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నారు. గూగుల్ భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ఆసియాలోనే ఇంత పెద్ద డేటా సెంటర్‌ను ఇంత ఎక్కువ ఖర్చుతో నిర్మించడం కూడా ఇదే ఫస్ట్ టైం.
ఈ డేటా సెంటర్ కోసం భారీగా పవర్ అవసరం కాబట్టి రెన్యూవెబుల్ ఎనర్జీ అంటే సోలార్, విండ్ పవర్‌లను ఉపయోగించనున్నారు. ఇందుకోసం 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. ఇండియాలో డిజిటల్ సేవలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని గూగుల్ ప్రయత్నాలు వేగవంతం చేసింది. మరోవైపు ఏపీ కూడా పారిశ్రామిక వర్గాలకు ఫ్రెండ్లీగా ఉండడంతో విశాఖను కేంద్రంగా ఎంచుకుంది గూగుల్. ఈ పెట్టుబడితో టెక్నాలజీ రంగంలో ఏపీ మరింత ముందుకు దూసుకెళ్లనుంది.
ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనలో టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించడం తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో నారా లోకేశ్…గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బైన్స్ తో సమావేశమయ్యారు. విశాఖలో డేటా సిటీ స్థాపనకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోకి తెచ్చామని, వీలైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లోకేశ్ కోరారు. విశాఖలో మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నారా లోకేష్ ప్రకటించారు. ఈ క్రమంలోనే, గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.











