కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా ట్రూ అప్ ఛార్జీల మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. 2019-20 నుంచి 2023-24 మధ్య కాలానికి సంబంధించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు APRECకి లేఖ రాసింది. ఈ నిర్ణయంతో దాదాపు 4 వేల 497 కోట్ల 89 లక్షల భారం తప్పనుంది.
జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ పేర్లతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపింది. ప్రజలు ఇప్పటికీ ప్రతి నెలా బిల్లులో వాటిని చెల్లిస్తున్నారు. అయితే చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగానే ప్రభుత్వం రూ.వేల కోట్ల ట్రూఅప్ భారాన్ని పూర్తిగా భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో చిన్న వ్యాపారస్తులు పరిశ్రమలకు ప్రభుత్వం భారీ ఊరట లభించనుంది.
ట్రూ-అప్ ఛార్జీలు అంటే
సాధారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOMs) విద్యుత్తును కొనుగోలు చేసేటప్పుడు అయ్యే ఖర్చు, అంచనాల కంటే పెరిగినప్పుడు ఆ అదనపు వ్యయాన్ని ‘ట్రూ-అప్’ చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తాయి. జగన్ ఐదేళ్ల కాలానికి సంబంధించి ఉన్న ఈ బకాయిలు ప్రస్తుత బిల్లులపై ప్రభావం చూపాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం కూడా ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ప్రజలపై భారం వేయకుండానే, ప్రభుత్వమే నేరుగా ఈ నిధులను సర్దుబాటు చేయడం ద్వారా డిస్కమ్‌ల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల విద్యుత్ రంగంలో జవాబుదారీతనం పెరగడంతో పాటు సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కలగకుండా చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.











