కరోనా కారణంగా నవంబర్ వరకు ప్రభుత్వం ఉచితంగా సరకులు పంపిణీ చేసింది. డిసెంబర్ నుంచి రాష్ట్ర ప్రజలు డబ్బులు చెల్లించి రేషన్ తీసుకోవాలి. అంతేగాక గతంలో కంటే రేషన్ సరుకుల ధరలు పెరిగాయి.
పెరిగిన ధరలు..
కార్డులో ఉన్న ఇంటి సభ్యులు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో పంచదార ఇస్తారు. కిలో బియ్యం రూపాయికే ఇస్తున్నప్పటికీ కందిపప్పు, పంచదార రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో కందిపప్పురూ. 67, పంచదార అరకిలో రూ. 17, కిలో బియ్యానికి రూపాయి చెల్లించి సరకులు తీసుకోవాలి. అంతకుముందు కందిపప్పు కిలో రూ. 40లు ఉండగా.. రూ. 27 పెరిగి రూ. 67 అయ్యింది. 4 నెలల క్రితమే వీటి ధరలు పెంచినా.. కరోనా కారణంగా ఇప్పటి వరకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ సరకుల పంపిణీ నవంబరుతో ముగియటంతో ఈ నెల నుంచి యథావిధిగా డబ్బులు చెల్లించి రేషన్ తీసుకోవలసి ఉంటుంది. పెరిగిన ధరలతో కందిపప్పు కొనేందుకు లబ్ధిదారులు ఇష్టపడరని రేషన్ డీలర్లు అభిప్రాయపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో దీని కంటే రూ. 20, 30లు మాత్రమే ఎక్కువ ధర ఉంది. రేషన్ దుకాణంలో ఇచ్చే కందిపప్పు నాణ్యత బాగా లేదని కార్డుదారులు అంటున్నారు.
విశాఖ జిల్లాలో..
విశాఖ జిల్లాలో 13,03,528 మంది లబ్ధిదారులు ఉన్నారు. పెరిగిన ధరలతో ఈ జిల్లాలో ప్రజలపై రూ. 4.37 కోట్ల భారం పడనుంది. పెరిగిన ధరలతో ఒక్కో కార్డుపై సగటున రూ. 34 అదనపు భారం పడనుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తెలుపు కార్డుల స్థానంలో బియ్యం కార్డులు ఇచ్చింది. కార్డు ఉన్నవారందరికీ ఇప్పటి వరకు ఉచిత సరకులు ఇచ్చినా.. ఇకపై బియ్యం కార్డు దారులకే సరుకులు పంపిణీ చేయనున్నారు.
Also Read: విశాఖలో కరోనా మరణాలు తగ్గే అవకాశం











