ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా సకాలంలో రేషన్ పంపిణీ చేయడంలో డీలర్లదే కీలకపాత్ర. ఏపీలో వచ్చే జనవరి నుంచి రేషన్ డోర్ డెలివరీకి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. అయితే ఏపీలో ఇప్పటికే పనిచేస్తున్న 29783 డీలర్లను ఏం చేయాలనే దానిపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేషన్ డోర్ డెలివరీ చేయడానికి డీలర్లు ముందుకు రావడం లేదు. అందుకే వాలంటీర్ల ద్వారా డోర్ టు డోర్ రేషన్ డెలివరీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన వాహనాలను కూడా సిద్దం చేస్తోంది.
డీలర్ల వ్యవస్థకు మంగళం పాడుతారా?
ప్రతి 700 కుటుంబాలకు ఒక రేషన్ డీలర్ ను నియమించడంతో ప్రతి నెలా లబ్దిదారులకు సకాలంలో రేషన్ సరఫరాకు వీలుకలుగుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం రేషన్ సరకులు లబ్దిదారుల ఇంటి వద్దకే సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే ఇక్కడ ఓ చిక్కు వచ్చి పడింది. పౌరసరఫరాలకు శాఖ ముందుగా డీడీలు తీస్తేనే వారు డీలర్లకు బియ్యం పంపిస్తారు. అలా ఒక్కో డీలర్ రెండు లక్షలు పెట్టుబడి పెట్టి, ఆ సరకును లబ్దిదారులకు అందిస్తున్నారు. అయితే డీలర్లను తొలగించి వాలంటీర్లకు రేషన్ పంపిణీ అప్పగిస్తే, పౌరసరఫరాల శాఖకు డీడీలు ఎవరు తీస్తారనే అనుమానం వస్తోంది. వాలంటీర్లకు ఇప్పటికే ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఇక లక్షలు ఖర్చు చేసి రేషన్ పంపిణీ చేయండంటే వారు ఆ ఉద్యోగం వదులుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
డీలర్ టు వాలంటీర్
ఏపీలో రేషన్ పంపిణీ చేసినందుకు కమిషన్ గా డీలర్లకు ప్రతి నెలా ప్రభుత్వం రూ.20 కోట్లు చెల్లిస్తోంది. ఇందుకుగాను డీలర్లు ముందుగా పౌరసరఫరాల శాఖకు డీడీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక వాలంటీర్లతో రేషన్ సరఫరా చేయించడం వరకూ బాగానే ఉన్నా, డీలర్లు లేకుండా వ్యవస్థ నడిచేలా లేదు. అందుకే పౌరసరఫరాల శాఖ నుంచి రేషన్ తీసుకు వచ్చి వాలంటీర్లకు అప్పగించే వ్యవహారాలను డీలర్లకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇదే జరిగితే అటు డీలర్లు, వాలంటీర్లు కలసి రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. రేషన్ సక్రమంగా ప్రతి కుటుంబానికి అందించేందుకు కొత్తగా గ్యాస్ కంపెనీల తరహాలో ఓటీపీ మెసేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అంటే రేషన్ పొందే వారు తప్పనిసరిగా మొబైల్ ఫోన్ కలిగి ఉండాలి. వారి ఫోనుకు వచ్చే ఓటీపీ చెబితేనే వాలంటీర్లు రేషన్ డోర్ డెలివరీ చేస్తారు. ఇలా చేయడం వల్ల రేషన్ పక్కదారి పట్టకుండా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది.
56 కార్పొరేషన్లకు ద్వారా వాహనాలు
ఇటీవల ఏపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పాలకవర్గాలను నియమించింది. ఆ కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకుని రేషన్ పంపిణీకి అవసరమైన వాహనాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలా సమకూరే వాహనాలు వాలంటీర్లకు అప్పగించి ప్రతి నెలా మొదటి వారంలోనే ప్రతి కుటుంబానికి రేషన్ అందేలా చూడాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో డీలర్ల వ్యవస్థ ఉంటుందా? ఊడుతుందా? అనేదానిపై ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది.