ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. దాదాపు రూ.3 వేల 500 కోట్ల లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారు ఆనాటి సీఎం జగనేనని తేలిపోయింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరిగా జగన్‌కే చేరిందని వెల్లడైంది. ప్రధాన నిందితుడు (A-1) రాజ్ కసిరెడ్డి ప్రతినెలా రూ.50-60 కోట్లు వసూలుచేసి ఆ మొత్తాన్ని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి (A-4), నాటి వైసీపీ నేత విజయసాయిరెడ్డి (A-5), భారతి సిమెంట్స్ డైరెక్టర్, జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీకి (A-33) అందజేసేవారని, వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్‌కు చేర్చేవారని తేలింది. ఇలా రూ.3,500 కోట్ల మేర కొల్లగొట్టినట్లు వెలుగుచూసింది. దీన్నిబట్టి ఈ మొత్తం కుంభకోణమంతా జగన్ కోసం, ఆయనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల ద్వారానే జరిగినట్లు రుజువైంది.
ఇలా వసూలు చేసిన సొమ్మును కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు అందజేసి,ఓట్ల కొనుగోలుకు ప్రయత్నాలు చేసినట్లు తేలింది. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దాఖలు చేసిన 305 పేజీల ప్రాథమిక అభియోగపత్రం ఆదివారం వెలుగుచూసింది. అందులోని అంశాల్ని విశ్లేషిస్తే…ఈ వైసీపీ మద్యం ముఠాను తెరవెనక నుంచి నడిపించిన ‘బిగ్‌బాస్’ జగనేనని స్పష్టమైపోయింది. పలుకుబడిని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడి సొమ్ము కొల్లగొట్టినట్లు సిట్ తేల్చింది.
2019లో అధికారంలోకి రాగానే ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా నూతన మద్యం విధానం రూపకల్పన, అందుకోసం నిర్వహించిన సన్నాహక సమావేశాలు, ఈ కుట్ర అమలుకు అనుసరించిన విధానం, ముడుపులు చెల్లించిన బ్రాండ్లకు అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇవ్వడం, ముడుపులివ్వడానికి నిరాకరించిన కంపెనీలకు అసలు ఆర్డర్లే ఇవ్వకుండా మార్కెట్ నుంచి తరిమేయడం, ముడుపుల సొమ్ము వసూలు కోసం అనుసరించిన విధానం, ఆ సొమ్ము ఎవరెవరికి, ఎలా చేరింది? డొల్ల కంపెనీల ద్వారా దాన్ని ఎలా మళ్లించారు? గత సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఖర్చుచేశారు? హవాలా ద్వారా దుబాయ్‌కి ఎలా తరలించారు? ఈ డబ్బుతో ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపారు? విదేశాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు? ముడుపుల సొమ్ము దాచిన డెన్‌లు ఎక్కడెక్కడున్నాయి? తదితర వివరాలన్నింటినీ ఈ అభియోగపత్రంలో సిట్ పేర్కొంది. సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంటరీ సాక్ష్యాలు, బ్యాంకు లావాదేవీల రికార్డులు, CDRలు, ప్రయాణాలు, ఫోరెన్సిక్ నివేదికలన్నీ విశ్లేషించి ఈ కుంభకోణం గుట్టు రట్టుచేసింది.
మద్యం ముడుపుల ద్వారా వచ్చిన డబ్బును గత ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న జగన్ OSD పి.కృష్ణమోహన్‌రెడ్డి, అప్పటి CMO కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, నాటి వైసీపీ నేత విజయసాయిరెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ సహా అనేక మందికి చేరేది. రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరగణంతో వీరు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు టెలికాం రికార్డుల విశ్లేషణలో వెల్లడైంది. మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి తదితరులు రాజ్ కెసిరెడ్డి ముఠాలోని సభ్యులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండేవారు. అనేక సందర్భాల్లో వారితో కలిసి ఒకేచోట ఉండేవారు. ఆ సందర్భాల్లోనే ముడుపులు తీసుకున్నారు.
ముడుపుల ద్వారా కొల్లగొట్టిన సొత్తులో రూ.200-300 కోట్లను గత సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చుల కోసం వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు. ఆ పార్టీ నేత, జగన్‌కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ద్వారా ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అభ్యర్థులకు ఈ డబ్బు చేరవేశారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన పీఏలు, తనవద్ద పనిచేసే గన్‌మెన్‌ను ముడుపుల డబ్బు తెచ్చేందుకు హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని డెన్‌లకు పంపేవారు. ఈ సొత్తు రవాణా కోసం తుడా వాహనాలు వినియోగించారు. ఒక్కో విడతలో రూ.8-9 కోట్ల చొప్పున తెచ్చేవారు. ఈ డబ్బును చెవిరెడ్డి చెప్పినవారికి ఇచ్చేవారు. కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పీఏకూ ఈ సొమ్ము అందజేశారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో గరికపాడు చెక్‌పోస్టు వద్ద పట్టుబడ్డ రూ.8.36 కోట్లు..మద్యం ముడుపుల సొత్తే.
మద్యం ముడుపుల్లో కమీషన్ల ద్వారానే కాకుండా..సొంతంగా కొన్ని మద్యం సరఫరా కంపెనీలను ఏర్పాటుచేసుకుని రాజ్ కసిరెడ్డి దోచుకున్నారు. ఈ సొత్తుతో తూకేకుల ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి A-9తో కలిసి అనేక స్టార్టప్ కంపెనీలు ఏర్పాటుచేశారు. అప్పటికే ఉన్న కొన్ని కంపెనీలను కొనేశారు. ప్రధానంగా ఈవీలు, ఫార్మా, లాజిస్టిక్స్, ఇతర వర్ధమాన రంగాల్లో కంపెనీలు పెట్టారు. వాటికి పరిశోధన వ్యయం, నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులన్నింటికీ మద్యం ముడుపుల సొత్తే వాడారు. రాజ్ కెసిరెడ్డి ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరిట సినీ నిర్మాణ కంపెనీ ఏర్పాటుచేసి, స్పై అనే సినిమా తీశారు. దీనిద్వారా నల్లధనాన్ని వైట్‌లోకి మార్చుకున్నారు. ఆ డబ్బుతో హైదరాబాద్ శివార్లలో భారీగా భూములు కొన్నారు. రాజ్ కెసిరెడ్డి, ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డిలు మద్యం ముడుపుల సొత్తుతో అత్యంత ఖరీదైన కార్లు కొనుగోలు చేశారు.
అదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, ఎస్‌ఎన్‌జే షుగర్స్, పీవీ స్పిరిట్స్, యూవీ డిస్టిలరీస్, అంబర్ స్పిరిట్స్, వర్చసో బెవరేజెస్, వాహిని డిస్టిలరీస్, శర్వాణి ఆల్కో బ్రూ, తిలక్‌నగర్ ఇండస్ట్రీస్, బీఆర్‌కే స్పిరిట్స్, జీఎస్‌బీ అండ్ కో ఎల్‌ఎల్‌పీ, ట్రాపికల్ ఇన్‌బెవ్, బృందావన్ మార్కెటింగ్, బీ9 బెవరేజెస్ తదితర సంస్థల ద్వారా ముడుపులు కొల్లగొట్టారు. మద్యం సరఫరా ఆర్డర్లు, బ్రాండ్ల రిజిస్ట్రేషన్లను మానిపులేట్ చేశారు. డొల్ల కంపెనీలు, డమ్మీ వెండర్లు, మద్యం వ్యాపారంతో సంబంధం లేని సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ముడుపులు వసూలు చేసేవారు. ప్యాకేజింగ్, ముడి పదార్థాలు, ప్రచార ఖర్చులు, ఇతరత్రా అవసరాల కోసం డబ్బులు వెచ్చించామంటూ నకిలీ ఇన్వాయిస్‌లు, తప్పుడు ఈ-వే బిల్లులు, నకిలీ వాహనాల నంబర్లు సృష్టించి దోపిడీకి తెరలేపారు.
ఈ ముడుపుల సొమ్ము అంతిమ లబ్ధిదారుకు ఇంకా ఏయే మార్గాల్లో ఎలా చేరిందో తేల్చేందుకు మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరముంది. 2019-2024 మధ్య అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు, కొందరు అధికారులు కలిసి ముడుపులు కొల్లగొట్టడానికి వీలుగా నూతన మద్యం విధానం తీసుకురావడంలో సహకరించారు. ఆ వివరాలు వెలికితీయాల్సి ఉంది.











