వైసీపీ అధినేత జగన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా..గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్‌లో ఇదే చర్చ జరుగుతోంది. జగన్ అరెస్టు ఖాయమని..ఈ వారం, ఈ నెలలోనే అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఐతే దీనిపై ప్రభుత్వం నుంచి గానీ, సిట్ నుంచి గానీ అధికారికంగా ఎక్కడా ప్రకటనలు రాలేదు. లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తున్న సిట్ కూడా ఆ దిశగా దూకుడు నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపించ లేదు.
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ను సిట్ సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి పక్కా ఆధారాలను సేకరించడంతోపాటు బలమైన వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తోంది ఇప్పటి వరకు 40కి పైగా నిందితులను గుర్తించింది. 12 మందిని కూడా అరెస్టు చేసింది. అయితే..వీరు ఇచ్చిన వాంగ్మూలాలతో జగన్‌పై కేసు పెట్టేందుకు అవకాశం ఉందంటున్నారు అధికార పార్టీ నేతలు. కానీ, చిన్న చిన్న వ్యక్తుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్నా..వాటి ఆధారంగా జగన్‌ను అరెస్టు చేయరాదన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
ప్రస్తుతం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహారాన్ని సిట్ అదికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే ఆయనను అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. దీంతో మిథున్ రెడ్డి ఇచ్చే వాంగ్మూలాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో ఇదే ప్రధాన వాంగ్మూలంగా పరిగణిస్తున్నారు. మిథన్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా జగన్ పై చర్యలు తీసుకుంటే. అది మరింత బలంగా ఉంటుందని ఇటు ప్రభుత్వం, అటు అధికారులు కూడా భావిస్తున్నారు. దీనికితోడు మరోసారి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా విచారించనున్నారు.
ఇలా మొత్తంగా అన్నివైపుల నుంచి బలమైన ఆధారాలను, సాక్ష్యాలను సేకరించిన తర్వాత..జగన్ అదుపులోకి తీసుకుంటారన్నది ఒక టాక్. మరోవైపు..సాధ్య మైనంత వరకు జగన్ ఇమేజ్‌ను తగ్గించి..ప్రజల్లో సానుభూతి లేని సమయం చూసుకుని ఆయనను అరెస్టు చేయాలన్నది మరో కోణంగా ఉందని చెబుతున్నారు.











