వైసీపీలో కేసుల ఎపిసోడ్ నడుస్తోంది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలు, అరాచకాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు లిక్కర్ స్కామ్‌లో కీలక నేతలు, గతంలో జగన్‌కు సన్నిహితంగా పని చేసిన అధికారులు అరెస్టయి జైళ్లకు వెళ్లారు. ఆదివారం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సైతం జైలుకు వెళ్లారు. ఇప్పుడు మాజీ మంత్రి, జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణ స్వామి వంతు కూడా వచ్చింది.
జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణ స్వామి పనిచేశారు. అయితే..ఆయనను ముందు పెట్టి కథ మొత్తాన్నీ కీలక నాయకులు, అధికారులు నడిపించారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చి..విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో నారాయణ స్వామి కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇక, గత నెలలో జగన్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే..ఈ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షలను లెక్క చేయకుండా.. వైసీపీ నాయకులు వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. బారీ ఎత్తున కార్యకర్తలను సమీకరించడం తో పాటు..వివాదాలకు కూడా దారితీశారు. రప్పా రప్పా పోస్టర్లతో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారు. ఆయా వ్యవహరాలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీకి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆదేశించారు. రెంటపాళ్లలో ఎంత మందిని సమీకరించారు? మీ పాత్ర ఏంటన్నది ఆమెనుంచి రాబట్టనున్నారు. ఇక, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కూడా ఇదే కేసులో పోలీసులు ఆదివారం నోటీసులు ఇష్యూ చేశారు. సోమవారం విచారణకు రావాలని..ఆదేశించారు. కార్యకర్తలను మోహరించడంతోపాటు..పోలీసులపై దురుసుగా వ్యవహరించారన్న కేసులు ఆయనపై నమోదు చేశారు.











