జగన్ అడుగులకు మడుగులొత్తే పోలీసులే కాదు.. అక్కడక్కడా ఆయన్ని ప్రశ్నించే ఇలాంటి కానిస్టేబుళ్లూ ఉంటారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక పోలీసులు అధికార పక్షానికే కొమ్ము కాస్తూ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అవి రుజువు చేసిన ఘటనలు కోకొల్లలు. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు అధికార పార్టీ వైపు నిలుస్తూ వచ్చారు. పై స్థాయిలో ఐపీఎస్ స్థాయి అధికారులను తన గుప్పిట్లో పెట్టుకున్న సీఎం.. తనకు నచ్చినట్లు వారితో చేయించుకుంటూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులు ఊరుకోకుండా.. వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఘటనలు అనేకం ఉన్నాయి.
అలాంటిది ఇప్పుడు పోలీసులకే ఒళ్లు మండింది. తాజాగా ఓ కానిస్టేబుల్ ఏకంగా జగన్ సర్కారుపై వ్యగ్యంగా విమర్శలు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జగన్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులను ఏ రకంగా అన్యాయం చేసిందో, వారికి రావాల్సిన భత్యాల్లో ఎలా కోత విధించిందనే విషయాలపై కానిస్టేబుల్ మోహన్ కుమార్ వ్యంగ్యంగా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
ఆ వీడియోలో ఇలా ఉంది. టీఏలు, డీఏలు, ఎస్‌ఎల్‌ఎస్‌లు ఎగ్గొడుతున్నందుకు నిరసనగా జగన్ ప్రభుత్వంపై నాకు ఒళ్లు మండి ఇలా చేస్తున్నానంటూ కానిస్టేబుల్ తెలిపారు. టీడీపీకి అనుకూలంగా సింహ సినిమాలో బాలక్రిష్ణ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగులను జగన్ సర్కార్ కు ఆపాదించి చెప్పారు. ఆ డైలాగ్ లు విని కుతకుతలాడండి అంటూ వ్యాఖ్యానించారు. సింహ సినిమాలో చెప్పిన ‘నో పోలీస్’ డైలాగుల మధ్య జగన్, రాజారెడ్డి పేర్లను చేర్చారు. ‘జగన్ గారూ అన్యాయం చేసినప్పుల్లా మీరైతే చూసీచూడనట్లు పొమ్మన్నారు.. అతనైతే క్లారిటీగా అసలు చూడొద్దంటున్నాడు. మీ శ్రేయోభిలాషిగా ఒక మాట చెబుతా సార్. ఉంటే జాగ్రత్తగా ఉండండి.. లేదంటే వెంటనే పీఆర్సీ ప్రకటించి పారిపోండి అని తమ బాధలు డైలాగ్ రూపంలో వివరించారు. అయితే, ఇలా పోలీసులు శాఖలోనే కానిస్టేబుల్ జగన్ సర్కార్ కు ఎదురు మాట్లాడడం సంచలనం అయింది. ఈ విషయం తెలుసుకున్న అతని తండ్రి.. తమ కుటుంబానికి ఏ ప్రమాదమూ రాకుండా ఉండేలా స్పందించారు.
తన కుమారుడు మోహన్ కుమార్ వ్యాఖ్యలపై ఆయన తండ్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు మెంటల్ గా సరిగ్గా లేడని అన్నారు. గతంలో అనవసరంగా తుపాకీ పేల్చి ఆర్నెల్లు జైలులో ఉన్నాడని అన్నారు. ఆ తర్వాత కూడా మరో రెండుసార్లు సస్పెండ్ అయ్యాడని అన్నారు. అతనిపై కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. గతంలో విశాఖపట్నం వెళ్లి మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కూడా ఇప్పించామని చెప్పారు. అయినా మానసిక స్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడలేదని అన్నారు. ఆత్మకూరు పోలీసులు మోహన్ కుమార్ మానసిక ఆరోగ్యం వల్ల అతడికి పగలు డ్యూటీలు వేయడం లేదని.. నైట్ డ్యూటీలే వస్తున్నారని చెప్పారు. అయితే, ఆ స్థితిలో కానిస్టేబుల్ మోహన్ కుమార్ ఉద్యోగంలో ఎలా కొనసాగుతున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో కుమారుడ్ని ప్రభుత్వం నుంచి కాపాడుకునేందుకు తండ్రి ప్రయత్నిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.