ఏపీలో రాజకీయ పొత్తుల్లో భాగంగా కేంద్రంలోని బీజేపీ కూడా త్వరలోనే టీడీపీ-జనసేనతో కలవబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన తమతో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఎప్పటి నుంచో అంచనా వేస్తున్నాయి. ఆ అంచనాలు దగ్గర పడ్డాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీలో యాక్టివ్ అవుతున్నందున బీజేపీ కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటోంది. పొత్తుల విషయంలో ఇకపై లేట్ చేయొద్దనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. కొద్ది వారాల క్రితమే అధిష్ఠానం ఏపీలోని బీజేపీ నేతల నుంచి అభిప్రాయం తీసుకుంది. ఇంకో వారం రోజుల్లోనే బీజేపీ నుంచి అధికార ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
బీజేపీ టీడీపీ-జనసేనతో కలిసేందుకు సానుకూలంగా ఉండడంతో.. జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన పర్యటనకు ముందే బీజేపీ సమీకరణాలు మారడంతో దిక్కుతోచని స్థితిలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన కోరిందే.. బీజేపీతో బేరం కుదుర్చుకోవడానికనే అభిప్రాయం ఉంది. అమిత్ షాను కలవడం కోసం నాలుగు రోజుల క్రితమే అపాయింట్ మెంట్ కోరినా ఇప్పటిదాకా ఇవ్వలేదు. బహుశా బీజేపీ ఆలోచన మారడం వల్ల.. జగన్ కు అపాయింట్ మెంట్ దక్కలేదనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.
ఏపీలో అసెంబ్లీ సీట్ల ఖరారు విషయంలో బీజేపీ నిర్ణయం కోసమే టీడీపీ, జనసేన వేచి చూస్తున్నాయని జనసేన నేతలు చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి వెళ్లటం ద్వారా సీట్లు, ఓట్లు పెరిగినప్పటికీ.. ఏపీలో ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. అక్కడ మూడు ప్రధాన పార్టీల చుట్టే రాజకీయం ఉంది కాబట్టి.. బీజేపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని ఏపీ బీజేపీ నేతలు వ్యక్తం చేశారు. ఆ మధ్య జరిగిన బీజేపీ నేతల సమావేశంలోనూ అంతా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో.. ఢిల్లీ బీజేపీ ప్రతినిధులు ఇలాగే రిపోర్టు ఇచ్చారని తెలిసింది. ఆ ప్రకారమే.. బీజేపీ కూడా టీడీపీ – జనసేన పొత్తులో కలిసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది.
నిజానికి జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షాను కలవాల్సి ఉంది. ప్రస్తుతం ఆయనకు రాష్ట్రంలో అన్ని వైపుల నుంచి వ్యతిరేక గాలులు వీస్తుండడంతో ఎటూ దిక్కు తోచని పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత, ప్రజా ప్రతినిధుల్లో అసమ్మతి, చేజారిపోతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇవి చాలవన్నట్లు సొంత చెల్లిలి రూపంలోనే ఓ ప్రత్యర్థి జగన్ కు తయారయ్యారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల దూకుడుతో జగన్ గ్రాఫ్ మరింత పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వచ్చే ఎన్నికల కోసం కేంద్ర సాయం కోరదామని భావించినట్లు సమాచారం. అందుకు బదులుగా మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీ ఇచ్చేందుకు కూడా సిద్ధపడినట్లు చెబుతున్నారు. కానీ, ఇంతలో బీజేపీ.. టీడీపీ – జనసేనలో కలవాలని నిర్ణయం తీసుకోవడంతో.. జగన్ కు ఆ మార్గం కూడా మూసుకుపోయినట్లయింది.