ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు చేరువ చేస్తున్నాం. నాణ్యమైన బియ్యాన్ని ప్రజల ఇంటి వద్దనే అందిస్తాం. నిరుద్యోగ యువతకు చేయూత కల్పిస్తున్నాం. సరిగ్గా ఏడాది క్రితం ఇవే మాటలు చెప్పిన వైసీపీ ప్రభుత్వం క్యాలెండర్ మారేసరికి తమ మాటని మార్చేసింది.ఆరేళ్ళ పాటు భీమా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి ఏడాదికే బురిడీ కొట్టించింది జగన్ సర్కార్. దీంతో ఎండియు ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. ఆపరేటర్లు విధులు బహిష్కరించడంతో ఏపీలో ఒకటవ తేదీన జరగాల్సిన రేషన్ పంపిణీని నిలిచిపోయింది.
అవినీతికి ఆస్కారం లేకుండా రేషన్ పంపిణీ చేస్తామంటూ 2021 ఫిబ్రవరిలో జగన్ ప్రభుత్వం అట్టహాసంగా మొదలు పెట్టిన రేషన్ పంపిణీ ఏడాదికే ఆటకెక్కేసేలా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటీ 43 లక్షల బియ్యం కార్డు దారులకు నాణ్యమైన బియ్యాన్ని ఇంటివద్దకే అందజేయాలని వైసీపీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు గానూ 539 కోట్ల రూపాయలు వెచ్చించి 9260 వాహనాలను కూడా కొనుగోలు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు చేయూత అందించేలా వారికే సబ్సిడీ పై ఈ వాహనాలు ఇచ్చింది. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన చెందుతున్న ఎండియు ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ నిలుపుదల చేశారు.
ఎండియు ఆపరేటర్లకు వాహనాలు పంపిణీ చేసే సమయంలో మొదటి ఏడాది కాలానికి పూర్తి వారంటీ, మిగిలిన ఐదేళ్లకు వారంటీ పొడిగింపు వర్తించేలా నిభంధనలు రూపొందించారు. అంటే మొత్తం ఆరేళ్ళ కాలానికి వాహనాలకు సంబందించిన భీమా పౌర సరఫరాల సంస్థే చెల్లిస్తుందని దీని అర్ధం. ఇక ఎండియు ఆపరేటర్లకు వాహణాలతో పాటు ఇచ్చిన పుస్తకాలలోనూ ఇదే విషయాన్నిప్రభుత్వం పొందుపరిచింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చి మొదటి ఏడాది కాలానికే వాహనాల భీమాను ప్రభుత్వం చెల్లిస్తుందని, మిగిలిన ఐదేళ్ల కాలానికి ఎండియు ఆపరేటర్లే కట్టుకోవాలని చెప్పడంతో వారిలో ఆందోళన నెలకొంది.
నిజానికి ఎండియు ఆపరేటర్లకు నెలకు 21 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అందులో 3 వేలు ఇంధన ఖర్చు , 5 వేలు సహాయకుడికి, 3 వేలు మరమ్మత్తులు , మరో 3 వేలు బ్యాంకు ఫైనాన్స్ కు పోగా ఆపరేటర్లకు మిగిలేది 7 వేల రూపాయలు. ఇక ఏటా భీమా విషయానికి వస్తే ఏడాదికి 10,190 రూపాయలు చెల్లించాలి. అంటే పై ఖర్చులతో పాటు భీమా కూడా కలిపితే తమపై నెలకు సుమారు వెయ్యి రూపాయల అదనపు భారం తమపై పడుతుందనే ఆవేదన ఎండియు ఆపరేటర్ల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో పాటు 5 వేల రూపాయలకు సహాయకుడు దొరకడం కూడా కష్టమైపోతోందని ఆపరేటర్లు వాపోతున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండియు ఆపరేటర్ల జనవరీ జీతాలలో నుంచి 10,190 రూపాయలు ఈ ఏడాది భీమా కింద కోత విధించారు. వచ్చే నెల నుంచి అందరి ఆపరేటర్ల ఖాతాల నుంచి భీమా నగదు మినహాయిస్తామని అధికారులు చెబుతున్నారు.అయితే ప్రభుత్వ నిర్ణయం పై ఎండియు ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ నిలుపుదల చేసి ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నిరసనలు తెలియజేశారు.ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
మొత్తానికి రేషన్ పంపిణీ అంశంలో నెలకొన్న భీమా మాయ జగన్ సర్కార్ అవగాహన రాహిత్యానికి మరో ఉదాహరణ అనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.











