ఏడేళ్ళ ప్రేమాయణానికి పెళ్ళి బంధంతో తెరదింపింది మలయాళ కుట్టి నయనతార. దర్శకుడు విఘ్నేష్ శివన్ , నయనతారల వివాహం ఈ నెల 9 వ తేదీన మహాబలిపురంలో గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం ఈ జంట కేరళలో ఉన్నారు. ఇక చెన్నై తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తమ పనుల్లో బిజీ కానున్నారు.
అయితే పెళ్ళి తర్వాత ఆమె సినిమాల్లో తిరిగి నటిస్తుందా, లేదా అనే అనుమానాలు ఆమె అభిమానులను వెంటాడుతున్నాయి. అయితే నయన్ తిరిగి మూవీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపించడంతో వారంతా సంబరపడిపోతున్నారట. అయితే నయనతార కొత్తగా ఒకే చేసే ప్రాజెక్ట్స్కు సంబంధించి ఆమె ఒక నిర్ణయానికి వచ్చారనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి.
పెళ్ళి తర్వాత నయనతార చేయబోయే సినిమాలకు కొన్ని కండీషన్స్ పెడుతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇప్పటికే తనను సంప్రదించిన డైరెక్టర్ లకు నయనతార కొన్ని నిబంధనలు విధించి వాటికి అంగీకరిస్తేనే కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారట. ముఖ్యంగా, హీరోలతో రొమాన్స్, పడక గది సన్నివేశాలు, సున్నిహితంగా ఉండే సన్నివేశాలతో పాటు డ్యూయట్ సాంగ్స్ కు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నారట.
ఇప్పటికే నయన్ పలు ప్రాజెక్ట్స్ కు గతంలోనే ఓకే చెప్పేశారు.అందులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “గాడ్ ఫాదర్” ఒకటి కాగా.. షారుఖ్ ఖాన్ నటిస్తున్న “జవాన్” మరొకటి. ఇవి కాకుండా నయనతార చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే చిరంజీవి “గాడ్ ఫాదర్” చిత్రంలో నయనతార ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ఆమెపై చిత్రీకరణ పూర్తి అయిపోయినట్టు సమాచారం.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘జవాన్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నయన్ కు ఇది తొలి హిందీ చిత్రం.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
అయితే పెళ్ళి తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకునేందుకు మలయాళ బ్యూటీ నయనతార డైరెక్టర్ లకి కండీషన్స్ పెడుతోందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి దీనిపై నయన్ ఏం క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి.