భారత రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లను కేంద్ర ఎన్నికల కమీషన్ స్వీకరించనుండగా.. 30న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జులై 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన వెంటనే బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు? ఎందరు అనే విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. రాష్ట్రపతి ఎన్నికకు ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో ఉన్న పక్షంలో జులై 18న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక ఓట్ల లెక్కింపును జులై 21న చేపడతారు. అదే రోజు విజేతను ప్రకటిస్తారు.
కాగా, ఉత్కంఠను రేకెత్తిస్తున్నా దేశంలో అత్యున్నత పదవి ఎన్నికలకు అధికార ప్రతిపక్షాలు ఇప్పటి వరకు తమ అభ్యర్ధులని ఖరారు చేయకపోవడం పై సర్వత్రా టెన్షన్ పెంచేస్తోంది.ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికలకు బీజేపీ వివిధ పార్టీల మద్దతును కూడగట్టే బాధ్యతలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు అప్పగించింది.దీంతో రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గేకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. తాము ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ఖర్గేను కోరారు.
ఇదిలా ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్న విపక్షాల తరఫున ఆ బాధ్యతను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్నారు.ఈ నేపధ్యంలోనే ప్రాంతీయ పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించగా,భేటీకి రావాలంటూ దీదీ ఏకంగా 22 మంది జాతీయ స్థాయి నేతలకు ఆహ్వానం పంపారు. కాగా , ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ భేటీకి మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా హాజరయ్యారు. వీరితో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తన పార్టీకి చెందిన మరో ఎంపీతో కలిసి వచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. మహారాష్ట్రలో అధికార పార్టీ శివసేన నుంచి ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది హాజరయ్యారు. ఇక జేడీఎస్ నుంచి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ, డీఎంకే నుంచి టీఆర్ బాలు, సీపీఐ నుంచి డి.రాజా తదితరులు హాజరయ్యారు. ఈ భేటీకి 8 రాష్ట్రాల సీఎంలను దీదీ ఆహ్వనిస్తే ఒక్క ముఖ్యమంత్రి కూడా హాజరుకాకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి బిజెపికి షాక్ ఇద్దామనుకున్న విపక్షాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విపక్షాల నుంచి బలమైన అభ్యర్థి అనుకుంటున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ట్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ పోటీకి ససేమిరా అన్నారు. తన అభ్యర్థిత్వంపై మొదటి నుంచి విముఖంగా ఉన్న పవార్.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విపక్షాల కీలక భేటీలో రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తేల్చిచెప్పారు. దాంతో, విపక్షాలు మరో అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడిపై పోటీ చేసి ఓడిపోయిన గోపాలకృష్ణ గాంధీని రాష్ట్రపతి ఎన్నికల బరిలో దింపాలని దీదీ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.











