2024 ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తలపెట్టిన జిల్లాల పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ‘ఎన్టీఆర్ స్ఫూర్తి – చంద్రన్న భరోసా’ పేరుతో కొనసాగానున్న ఈ పర్యటన తొలత అనకాపల్లి జిల్లా నుంచి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రతీ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించి జగన్ ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు మహానాడు, రెండవ రోజు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం, మూడవ రోజు బాధుడే బాధుడు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించిన బాబు అందులో భాగంగా తన పర్యటనను ఈ ఏడాది కాలం పాటు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వందకు పైగా నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఇక చంద్రబాబు జిల్లాల పర్యటన ఆధ్యానటం ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కొనసాగనుంది.వైసీపీ పాలనలో కష్టనష్టాలకు గురైన వర్గాలకు భరోసా కల్పించే విధంగా ఈ పర్యటనలో చంద్రబాబు ప్రజలతో మమేకమవనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు గడపనున్నారు.పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపడమే లక్ష్యంగా ఈ పర్యటనలు కొనసాగనున్నాయి.
జిల్లాల పర్యటనలో భాగంగా తొలి పర్యటన అనకాపల్లి జిల్లా నుంచి ప్రారంభమవుతోంది. జిల్లాలోని చోడవరంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు శంకుస్థాపన స్థలాన్ని ముందుగా బాబు సందర్శిస్తారు.అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన మహానాడు, బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.రాత్రికి అనకాపల్లి చేరుకుని చంద్రబాబు అక్కడ బస చేయనున్నారు.రెండవ రోజు పర్యటనలో భాగంగా అనకాపల్లిలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.ఆ తర్వాత చంద్రశేఖర కల్యాణ మండపంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై స్థానిక నేతలతో సమీక్షలు నిర్వహిస్తారు.ఇక రాత్రికి భోగాపురం సమీపంలోని సన్‌రే రిసార్ట్స్‌లో చంద్రబాబు బస చేస్తారు.మూడో రోజు పర్యటనను విజయనగరం జిల్లా పరిధిలోని చీపురుపల్లి, గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి క్షేత్ర స్థాయి ప్రజా సమస్యల పరిశీలన చేస్తారు.నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్‌లో, ఆ తర్వాత గుర్ల మండల కేంద్రంలో జరిగే సభల్లో బాబు పాల్గొంటారు. అనంతరం అక్కడే సమీపంలో ఉన్న తోటపల్లి కాల్వ పనులను ఆయన పరిశీలిస్తారు. తర్వాత గరివిడి మీదుగా చీపురుపల్లి చేరుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.
మొత్తం ఒక్కో విడతలో మూడేసి రోజులపాటు చంద్రబాబు పర్యటన ఉండనుంది. నెలకు రెండు దఫాలుగా జిల్లాల్లో టిడిపి చీఫ్ పర్యటిస్తారు. ఈవిధంగా ఏడాది కాలంలో వంద అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి చోటా మూడో రోజు కార్యక్రమాన్ని బాదుడే బాదుడు పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి వినియోగించుకోనున్నారు. రుతుపవనాలు మొదలవుతున్న సమయంలోనే ఆయన పర్యటనలు ఉండడంతో బహిరంగ సభలపై వీటి ప్రభావం ఎలా ఉంటుందోనని టీడీపీ వర్గాలు కాస్త ఆందోళన చెందుతున్నాయి. అయినా విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పనిచేస్తున్నారు.