ఒకప్పుడు అఖిల భారత స్థాయిలో ఎదురులేని పార్టీగా చలాయించుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్షీణ దశలో ఉండటంతో జాతీయ రాజకీయాల్లో తానే కొత్త కాంగ్రెస్ గా ఎదగాలని భారతీయ జనతా పార్టీ వ్యూహం. ఆ స్థాయిని అందుకునే వరకు ప్రాంతీయ పార్టీలతో కలసి కూటమిగా పోటీచేస్తూ క్రమంగా తన బలం పెంచుకోగలిగింది.
ప్రాంతీయ పార్టీలలో అనేకం భాజపాతో కలసి కేంద్ర, రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవి. అయితే, మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తినప్పుడో లేక భాజపాతో కలిస్తే విజయావకాశాలు ఉండవని భావించినప్పుడో అనేక ప్రాంతీయ పార్టీలు కటీఫ్ చేసుకునేవి. బిహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో పదేపదే ఇదే జరిగింది. కానీ, మొదటి నుంచి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా భాజపాను, దాని మాతృ సంస్థ జనసంఘ్ ను అంటిపెట్టుకున్న పార్టీలు రెండే రెండు- శిరోమణి అకాలీదళ్, శివసేన.
చిన్నాచితకా పార్టీలతో కలసి కాంగ్రెస్‌ను మట్టికరిపించాక, భాజపా ఇక ఏక వీరునిగా ముందుకెళ్లబోతున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్రలో శివసేన, తాజాగా పంజాబ్‌లో అకాలీదళ్ తనకు దూరమైనా భాజపా ఏమాత్రం కంగారు పడుతున్నట్లు లేదు. ఎన్నికల్లో ఇతర ప్రాంతీయ పార్టీల ఓట్లు భాజపాకు బదలీ కాకపోయినా శివసేన, అకాలీల ఓట్లు మొదటి నుంచీ బదలీ అయ్యేవి. కారణం-ఈ మూడు పార్టీలు మత ప్రాతిపదికపై ఏర్పడినవి కావడం.
కానీ, 2019 లోక్ సభ ఎన్నికల తరవాత మూడు పార్టీలవి మూడు దారులయ్యాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌ను బద్ధవైరిగా పరిగణించిన శివసేన ఇప్పుడు సరిగ్గా ఆ పార్టీతో కలసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. పంజాబ్‌లో అకాలీలు కాంగ్రెస్‌తో కలిసే ప్రసక్తే లేదు, అందుకు కావలసిన బలమూ లేదు. 2014 లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన అకాలీలు 2019 వచ్చేసరికి రెండు సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
మరోవైపు భాజపా దేశం మొత్తం మీద తన బలాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. 2019 ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించిన భాజపాకు, మిత్ర పక్షాలతో 2014లో ఉన్నంత అవసరం ఇప్పుడు లేదు. కానీ, లోక్ సభలో 302 సీట్లతో మెజారిటీ ఉన్నా రాజ్యసభలో అది కొరవడింది. అయినా 370వ రాజ్యాంగ అధికరణ రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన, తాజాగా వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో నెగ్గించుకోవడానికి బిజూ జనతా దళ్, వైకాపా, అన్నా డిఎంకె వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు తోడ్పడింది.
తాజాగా అకాలీ దళ్ నిష్క్రమణ ఈ తటస్థ పార్టీల వైఖరిపై ఎలాంటి ప్రభావం చూపుతుందని తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వస్తుసేవల పన్నులో రాష్ట్రాలకు న్యాయమైన వాటా ఇవ్వలేదని భాజపాపై తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలు రుసరుసలాడుతున్నాయి.
దీనికి తోడు 2017-19లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ నష్టపరిహార సెస్సు లో రూ. 47,000 కోట్లను కేంద్రమే అట్టిపెట్టుకుందని కాగ్ వెల్లడించడం, ప్రాంతీయ పార్టీలను మరింత దూరం చేస్తోంది. వాజ్ పేయి అనుసరించిన సంకీర్ణ ధర్మానికి నరేంద్ర మోదీ నీళ్లు వదలి, ఏక పార్టీ ఆధిక్యతను సాదించాలని చూస్తున్నారని అవి ఆందోళన చెందుతున్నాయి. ఈ భావన బిహార్ ఎన్నికలకు భాజపా, జనతా దళ్ (యు) మధ్య సీట్ల పంపకాన్ని ప్రభావితం చేయకమానదు. మరి భాజపా ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబిస్తుందా అన్నది చూడాలి.
– అర్జున్











