భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కు అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తాను అనేక కార్యక్రమాలు చేపట్టానని, పార్టీని ప్రజలలోకి తీసుకుని వెళ్లేందుకు ఎంతో కృషి చేసినా తనకి అవమానాలే ఎదురయ్యాయని తన సన్నిహితుల వద్దా కన్నా వాపోయినట్లు సమాచారం. తనను తొలగించినందుకు సరైన కారణాలు చెప్పకపోగా ఎలాంటి పదవి ఇవ్వకుండా అవమానించారనే కోపం కన్నాలో ఉందంటున్నారు.
ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లడడమో, ప్రకటనలు చేయడమో తాను చేసిన తప్పా అని కన్నా లక్ష్మీ నారాయణ వాపోతున్నట్లు సమాచారం. తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన నాటి నుంచి నేటి వరకు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ విషయంపై పార్టీలో చర్చ జరుగుతోందని అంటున్నారు.
అలకే.. ఇంకేం చేస్తారు
తనను పార్టీ పదవి నుంచి తప్పించారనే కోపంతో ఉన్నప్పటికీ, కన్నా లక్ష్మీ నారాయణ అలక వహించడం తప్ప మరింకేం చేయలేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కన్నా లక్ష్మీ నారాయణకు సీనియర్లను కాదని అధ్యక్ష పదవి కట్టబెట్టడం వెనుక అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి వారణాసి రామ్ మాధవ్ పాత్ర ఉందని, ఇప్పుడు ఆయనకే ఏ పదవి లేకపోవడంతో కన్నా ఖాళీగా ఉండడం తప్ప చేసేదేమి లేదని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వానికి కేంద్రంలో మోదీ సహాయ సహకారాలు అందుతున్నాయని, ఆ విషయం గమనించకుండా జగన్‌పై విమర్శలు చేయడం, గవర్నర్‌ను కలవడం వంటి కార్యక్రమాలు చేయడం వల్లే కన్నాను పక్కన పెట్టారని అంటున్నారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించినా, జాతీయ కార్యవర్గంలో చోటు కల్పిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కన్నా లక్ష్మీ నారాయణ. అయితే ఆ ఆశలు నిరాశ కావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారని కన్నా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
కమలం పాలిటిక్స్ అర్ధం కాలేదా?
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు పార్టీలోని అంతర్గత రాజకీయాలు అర్ధం కాలేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన సన్నిహితులు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అక్కడి రాజకీయాలే ఇక్కడ కూడా ఉంటాయని భ్రమించారని, అయితే, కాంగ్రెస్ రాజకీయాలకు, బీజేపీ అంతర్గత రాజకీయాలకు చాలా తేడా ఉందనే విషయం గ్రహింపులోకి రాలేదని అంటున్నారు.
కమలనాథుల అంతర్గత రాజకీయాలు పతాక స్ధాయిలో ఉంటాయని, తమకు అడ్డం వచ్చిన వారిని అధికారంలో ఉన్న వారు తప్పించడం బీజేపీలో సాధారణమేనని అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా పార్టీ సీనియర్లు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను చూపిస్తున్నారు. ఈ విషయం అర్ధం కాకపోవడం వల్లే కన్నా లక్ష్మీనారాయణ కమలంలో కాలు వేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడు అలకబూని కూర్చోవడమే తప్ప ఇంతకంటే ఇంకేమీ చేయలేరని అంటున్నారు.











