మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు అయింది. ఏపీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను ఇచ్చింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఈ అనుమతులు ఇచ్చింది. దేశాన్ని విడిచి బయటికి పోరాదని ఆదేశించింది. పైల్స్ తో బాధపడుతున్న ఆయన రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఏపీలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో చేర్చారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హైకోర్ట్ ఆయనకు ఈ అనుమతులు ఇచ్చింది.
ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్న పాత్ర ఉందటూ ఏసీబీ అధికారులు ఆయనను జూన్ 12న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిమ్మాడలోని ఆయన ఇంటిలో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న ఆయనను నిమ్మాడ నుంచి గుంటూరుకు తీసుకువచ్చారు. ఈ విషయంలో ఏసీబీ అధికారుల తీరును కోర్టు తప్పిపట్టింది. మానవత్వం ఉన్న మనసులు ఇలా చేయరని అక్షింతలు వేసింది. దాదాపు 70 రోజుల పాటు జైలులో ఉన్న ఆయన బయటికి రావడంతో కుటుంబ సభ్యులు, టీడీపీ పార్టీ శ్రేణులు సంతోషంగా ఉన్నారు.