సుశాంత్ ఆత్మహత్యతో కొత్తగా వైరల్ అవుతున్న పదం నెపోటిజం. ఇంతకీ ఈ నెపోటిజం ఏమిటి? సినిమా రంగంలో ఎందుకింత ప్రాధాన్యం ఏర్పడింది? అనే విషయాలతోపాటు మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయంలో ఏమంటున్నారో చూద్దాం. బంధుప్రీతి… సినిమా రంగంలో దీన్ని వారసత్వం అని కూడా అంటారు. తెలుగు సినిమా రంగాన్ని ఏలుతున్నవారిలో మెజారిటీ హీరోలు వారసులే అన్నది కొందరి వాదన. ఈ బంధుప్రీతి అనే అంశం ఇప్పుడు బాగా చర్చనీయాంశమైంది. తెలుగు సినిమా రంగంలో ఈ బంధుప్రీతి మీద నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడారు.
ఆయన ఏమంటారంటే..`మా కుటుంబం నుంచి వచ్చిన హీరోలంతా ఎంతో కష్టపడిన తర్వాతే తెర పైకి వచ్చారు. బన్నీ, చరణ్, వరుణ్, సాయితేజ్, నిహారిక… వీరంతా తమ కెరీర్ కోసం, సినిమా కోసం విపరీతంగా కష్టపడతారు. ఎన్టీయార్ కొడుకు కాబట్టే బాలకృష్ణ స్టార్ అయ్యారనడం సరికాదు. ఆయనకంటూ సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకుని అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఏఎన్నార్ కొడుకు కాబట్టి నాగార్జునను చూసెయ్యలేదు. ఆయన తన గ్లామర్‌తో, నటనతో `కింగ్`గా ఎదిగారు. అలాగే జూనియర్ ఎన్టీయార్ ఎంత కష్టపడతాడో నేను స్వయంగా చూశాను. `అరవింద సమేత` షూటింగ్ సమయంలో 44 డిగ్రీల ఎండలో షర్ట్ కూడా లేకుండా ఫైట్ చేశాడు.
అలాగే మహేష్ బాబు కాస్త లావుగా ఉండేవాడు. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు కేబీఆర్ పార్కులో రోజూ రన్నింగ్ చేసేవాడు. చూస్తుండగానే స్లిమ్‌గా తయారైపోయాడు. కష్టపడకపోతే ఎవరికీ ఇక్కడ చోటు లేదు. దేవుడి కొడుకైనా.. అతడు నచ్చకపోతే ప్రజలు తిరస్కరిస్తారు` అంటూ నాగబాబు తన మనసులో మాటను బయటపెట్టారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఆ నాలుగు కుటుంబాలు అంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తుంటారన్నారు. ఒక విధంగా ఆయన మాటల్లో కొంత వాస్తవం లేకపోలేదు. తమ వారసులను సినిమా రంగంలో నిలబెట్టాలనుకుని విఫలమైన వారు కూడా ఉన్నారు. ఏ బంధుప్రీతి అండదండలూ లేకుండా పైకి వచ్చిన నాని, విజయదేవరకొండ లాంటి హీరోలు చాలా మందే ఉన్నారు. కాకపోతే నెపోటిజం అనే పదాన్ని ఇప్పుడు బూతద్దంలో చూస్తున్నారు.











