(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీకి ఒకనాడు కంచుకోటైన సిక్కోలు ముద్దుబిడ్డ అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త సోయగం తెచ్చిపెట్టనున్నారని , టీడీపీ రధసారధిగా ఆ పార్టీ ప్రతిష్టతను ఇనుమడింపచేయనున్నారని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రంనాయుడు ఆశీస్సులతో 1996లో తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలోని అప్పటి హరిచంద్రపురం అసెంబ్లీ నుండి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా రాష్ట్ర అసెంబ్లీలో అచ్చెన్నాయుడు అడుగుపెట్టారు. అంతవరకు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రంనాయుడు ఎంపీగా గెలుపొందారు. అందువల్ల జరిగిన ఉప ఎన్నికతో అచ్చెన్నాయుడుకు రాజకీయ ఆరంగేట్రంకు అవకాశం కలిగింది. అనంతరం 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుండి మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొంది తన సత్తా చాటుకున్నారు.
హరిశ్చంద్రపురం కనుమరుగు
2004లో జరిగిన అసెంబ్లీల పునర్విభజనలో హరిశ్చంద్రపురం కనుమరుగైంది. దాంతో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన అచ్చెన్న తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ కొర్ల రేవతిపతిపై ఓటమి పాలయ్యారు.
దురదృష్టవశాత్తు రేవతిపతి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయకమునుపే ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆ సందర్భంగా నిర్వహించిన ఉప ఎన్నికల్లో రేవతిపతి భార్య కొర్ల భారతి కాంగ్రెస్ అభ్యర్థిగా టెక్కలి అసెంబ్లీ బరిలో దిగగా , ఆమెకు ప్రత్యర్థి గా మరోమారు టీడీపీ తరపున పోటీచేసిన అచ్చెన్న మళ్లీ ఓటమి పాలయ్యారు.
2009 తరువాత…
అచ్చెన్న తన ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటూ , ప్రజలతో మమేకమవుతూ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయదుందుభి మోగించారు. ఆ తరువాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు అదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా, అనంతరం కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ హవా కొనసాగినప్పటికీ వైసీపీ అభ్యర్థిపై టెక్కలి నుండి గెలుపొంది తన సత్తా చాటుకున్నారు.
పార్టీ మారని రాజకీయ చరిత్ర
అచ్చెన్న కు పార్టీ మారని రాజకీయ చరిత్ర ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. ఆయన రాజకీయ ఆరంగేట్రం తెలుగుదేశంతోనే జరిగింది. మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ మారకుండా టీడీపీ లోనే ఉండటం ఆయనకు కలిసొచ్చిన అంశం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెస్ను ఫిరాయించి తెలుగుదేశంలోకి వచ్చినా, ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు మధ్యలో ప్రజారాజ్యంకు జంపై మళ్లీ టీడీపీలోకి వచ్చినా, అచ్చెన్న అలా గడప దాటకపోవడం గొప్పవిషయంగా నిలుస్తోంది. అందువల్ల అచ్చెన్న ప్రస్తావన వచ్చినప్పుడు ప్రజలు వీటిని కూడా చర్చించుకుంటున్నారు. ఇది కూడా ఆయనపై విశ్వసనీయతకు ఒక కారణమవుతోంది.
బిసి కావడం కలిసొచ్చింది
అచ్చెన్న ఉత్తరాంధ్ర జిల్లాల బిసి నాయకుడు అవ్వడం , మంచి వాక్పటిమ ఉండటం , చట్టసభలు – ప్రవర్తనా నియమావళిపై అవగాహన ఉండటం , పార్టీ నాయకులు , కేడర్తో సన్నిహిత సంబంధాలు ఉండటం కలిసొచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. దీనివల్ల పార్టీకి ఆయన ఎసెట్ గా మారే పరిస్థితి గోచరిస్తోంది.
మనోధైర్యం నింపిన కోర్టు వ్యాఖ్యలు
ఈఎస్ఐ కుంభకోణంలో ఇరుక్కొని జైలు పాలైనప్పటికీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరుచేసే సమయంలో ‘మందుల కొనుగోలుకు అచ్చెన్న చేసిన సిఫార్సు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలను ఆశించినట్లు ఏసీబీ తన దర్యాప్తులో రూఢీ చేయలేకపోయిందని’ అనడం ఆయనలో మనోధైర్యాన్ని నింపిందని , ఈ నేపథ్యంలో రెట్టింపు ఉత్సాహంతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.