(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నం చేయడం కలకలం రేగింది. సహజంగా ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10000 నుంచి గరిష్ఠంగా రూ.25 లక్షల వరకూ సహాయం చేస్తూ ఉంటారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన మూడు చెక్కులు రూ.16 వేలు, రూ.45 వేలు, రూ.45 వేలను బాధితులు డ్రా చేసుకున్నారు. అవే చెక్కులను ఫ్యాబ్రికేట్ చేసి దుండగులు నకిలీ చెక్కులు తయారు చేశారు. ఆ చెక్కులపై నంబర్లు, బ్యాంకు సీలు, సంతకాలను ఫోర్జరీ చేశారు. తరవాత ఆ మూడు చెక్కుల నుంచి బెంగళూరు, ఢిల్లీ, కోలకత్తా ఎస్బీఐ శాఖ నుంచి రూ.117 కోట్లు డ్రా చేసేందుకు అక్రమార్కులు ప్రయత్నించారు. చెక్కులపై పెద్ద మొత్తం ఉండటంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి ఏపీ సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ అధికారులను సంప్రదించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అంత పెద్ద మొత్తం ఇవ్వరని, పొరుగు రాష్ట్రాల వారికి సీఎం ఆర్ ఎఫ్ నిధులు ఇవ్వడానికి అవకాశం లేదని తేలడంతో బ్యాంకు అధికారులు వెంటనే చెక్కుల నుంచి నిధుల విడుదల నిలిపివేశారు. దీంతో రూ.117 కోట్ల నిధుల గల్లంతును ఆపగలిగారు.
దీని వెనుక ఎవరున్నారు?
సీఎంఆర్ఎఫ్ నుంచి పెద్ద మొత్తంలో నిధులు కాజేయాలని చూసిన కేసులో తెరవెనుక రాజకీయ ప్రముఖులు దిగ్గజాలు ఉన్నారా అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు కొల్లగొట్టాలని సామాన్యులు ప్రయత్నించి ఉండకపోవచ్చు. రూ.117 కోట్ల పెద్ద మొత్తానికే స్కెచ్ వేశారంటే అధికారంలో ఉన్న ఇద్దరు పెద్దల హస్తం ఉందనే సమాచారం అందుతోంది. ఇందులో రూ.24.55 కోట్ల చెక్కు కోల్ కతా లోకి ఓ సూట్ కేస్ కంపెనీకి నిధుల బదలాయించాలని చూశారట. సదరు కంపెనీ ఎవరిదనే విషయంలో రకరకాల అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వమే ఆ విషయం నిగ్గు తేల్చాల్సి ఉంది.
ఏపీలో చెక్కులు ఎందుకు డిపాజిట్ చేయలేదు…
ఏపీలో బ్యాంకు అధికారులకు సీఎంఆర్ఎఫ్ గురించి పూర్తి అవగాహన ఉంది. గత 16 సంవత్సరాలుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు బ్యాంకులకు వస్తూనే ఉన్నాయి. అయితే ఇంత పెద్ద మొత్తం ఎప్పుడూ రాలేదు. రావుకూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.10 వేల నుంచి గరిష్ఠంగా చాలా తక్కువ సందర్బాల్లో రూ.25 లక్షల వరకూ సహాయం అందిస్తూ ఉంటారు.
ఇంత పెద్ద మొత్తంలో మూడు చెక్కుల ద్వారా రూ.117 కోట్ల విలువైన చెక్కులు సీఎంఆర్ఎఫ్ కింద ఇవ్వరని ఏపీలో బ్యాంకు అధికారులకు తెలుసు. ఇలాంటి చెక్కులు వస్తే వారు వెంటనే, పోలీసులకు పట్టిస్తారు.
అందుకే దీనిపై పెద్దగా అవగాహనలేని ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు కేంద్రంగా చెక్కులను డిపాజిట్ చేశారు. అంటే దీనిపై పూర్తి అవగాహన ఉన్న వారే సీఎంఆర్ఎఫ్ నిధులు కొల్లగొట్టడానికి ప్రయత్నించారని అర్థం అవుతోంది.
బ్యాంకులో చెక్కులు డిపాజిట్ చేసినవారి సీసీ పుటేజీ ఏమైంది?
చెక్కులను నేరుగా బ్యాంకులకు వెళ్లి డిపాజిట్ చేయడం, లేదంటే ఏటీఎం సెంటర్లలో చెక్ డిపాజిట్ సౌకర్యం వినియోగించుకుంటారు. మరికొన్ని కంపెనీల చెక్కులను ఆయా కంపెనీల అకౌంటెంట్లు, అంటెండర్లు వెళ్లి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ ఉంటారు. అంటే చెక్కులు ఎక్కడ డిపాజిట్ చేసినా బ్యాంకుల్లో అయినా, ఏటీఎం కేంద్రాల్లో అయినా సీసీ కెమెరాలు ఉంటాయి. రూ.117 కోట్లు కాజేయాలని మూడు ప్రాంతాల్లో ఏక కాలంలో చెక్కులు డిపాజిట్లు ఎలా చేశారు అనే అనుమానం రాకమానదు.
కేసునమోదు, దర్యాప్తు ముమ్మరం
సీఎంఆర్ఎఫ్ నిధులు కొల్లగొట్టాలని ప్రయత్నించిన విషయం బయటకు పొక్కడంతో ఏపీ సచివాలయం రెవెన్యూ శాఖ సహాయ కార్యదర్శి మురళీకృష్ణారావు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న అసలు శక్తులను పోలీసులు పట్టుకుంటారా లేదా వేచిచూడాల్సిందే.