ఇప్పటిదాకా సినిమా వాళ్లు డ్రగ్స్ అంతు చూశారు. ఇప్పుడు డ్రగ్స్ వంతు వచ్చింది.. సినిమా వాళ్లు అంతుచేసేదాకా వదిలేలా లేదు. కలుగుల్లోని ఎలుకల్లా ఒక్కొరొక్కరుగా బయటికి వస్తున్నారు. డ్రగ్స్ అనే ఆకర్ష మంత్రంలో చిక్కుకున్న వారందరినీ ఎన్సీబీ బయటికి లాగే ప్రయత్నం చేస్తోంది. దర్యాప్తులో చురుకుగా వ్యవహరిస్తున్న ఎన్సీబీ ఎవరినీ వదిలేలా కనిపించడం లేదు. రియా నోటి నుంచి ఎవరి పేర్లయితే బయటికి వచ్చాయో అందరికీ నోటీసులు జారీ చేస్తోంది. ఆ తర్వాత అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. ఎప్పుడు అరెస్టు కావలసి వస్తోందో తెలియక చకచకా షూటింగులు చేసేసుకుంటున్నవారూ ఉన్నారు.
మొత్తం ఎంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారో తెలియదుగానీ తాజాగా ముగ్గురి పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపించాయి. వారిలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ లకు ఎన్సీబీ నుంచి సమన్లు అందాయి. ఈవారంలోనే వీరిని విచారణకు హాజరుకావలసిందిగా ఆదేశించినట్లు తెలిసింది. వీరికి మరికొందరు తోడయ్యే అవకాశం ఉంది. రియా చక్రవర్తి వాడే మొబైల్ ఫోన్‌లోని వాట్సాప్ ఛాట్ ఆధారంగానే ఎన్సీబీ ఈ కేసు దర్యాప్తు సాగిస్తోంది. ప్రముఖ తెలుగు కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఇటీవల చర్చనీయాంశమైంది. దీంతో రకుల్ హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి హైకోర్టును ఆశ్రయించింది.
తనకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న కథనాలను ఆపాలన్నది ఆమె ఉద్ధేశం. హైకోర్టు కూడా రకుల్ అభీష్టానికి అనుగుణంగా ఆదేశాలిచ్చింది. కాబట్టి ఆమె జోలికి వెళ్లకుండా అందరూ జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ సమీపంలో షూటింగులో పాల్గొంటోంది. క్రిష్ దర్వకత్వంలో వైష్ణవ్ తేజ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఆమె నటిస్తోంది. వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ కేసులో త్వరలోనే ఆమెకు కూడా నోటీసులందే సూచనలు కనిపిస్తున్నాయి.
డ్రగ్స్ ఎందుకు సెలబ్రిటీలకే చేరుతున్నాయి?
డ్రగ్స్ వాడగలిగే సామర్థ్యం బిగ్ షాట్ లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ సెలబ్రిటీలను ఎలా ట్రాప్ చేయాలలో సరఫరాదార్లకు బాగా తెలుసు. సాధారణంగా హీరోహీరోయిన్లు అయితేనే వీటిని మార్కెట్లో బాగా వ్యాపింప చేయగలరు. మందుతో ప్రారంభమయ్యే ఈ వ్యవహారం చివరికి డ్రగ్స్ దాకా పాకిపోతుంది. ఒకసారి వీటి వలలో చిక్కుకున్న వారు బయటికి పోలేరు. అంత శక్తిమంతంగా ఈ డ్రగ్స్ ఉంటాయి. ఇందులో చిక్కుకున్నవారంతా మరికొందరిని ఇందులోకి లాగటం మినహా మరేమీ చేయలేరు. దాని కోసం పరిచయాలు పెంచుకుంటూ, పార్టీలు చేసుకుంటూ ‘ఆకర్ష మంత్రం’ పటిస్తారు. ఈ మంత్రం మహిమ వల్లే ఇన్ని పేర్లు ఈ కేసుల్లో చేరుతున్నాయి. ఈ కేసులో కూరుకుపోతే అరెస్టు అయినవారికి బెయిలు దొరకడం కూడా కష్టమే.