అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ గారాల పట్టి మొదటి పుట్టిన రోజును వేడుకగా చేసుకునేందుకు తల్లిదండ్రులతో పాటు ఆ కుటుంబసభ్యులు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే విధి వక్రించి వారి ఆశలను చిదిమేసి ఆ చిన్నారి ప్రాణాలను తీసింది.
దిష్టి తగలకూడదనుకుంటే ..
దిష్టి తగల కూడదని కళ్లకు, చెక్కెలికి పూసే కాటుక డబ్బానే ఆ పసివాడి ప్రాణాలను తోడేసింది. అభం శుభం తెలియని ఆ పసివాడు ఆడుతూ పాడుతూ కాటుక డబ్బా మూతను నోట్లో పెట్టుకున్నాడు. అది కాస్తా గొంతులోకి జారుకుని ఊపిరి సలపనీయకుండా ఆ పసివాడి ప్రాణాలను తీసి ఆ ఇంట విషాదం నింపింది.
హృదయ విదారకం..
ఈ హృదయ విదారక సంఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం రత్తకన్న గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కవిటి మండలం కుంకిలిపుట్టుగ గ్రామానికి చెందిన కుమార్, గీతా దొళాయి దంపతులకు ఏడాది కిందట మగబిడ్డ జన్మించాడు. ప్రసవం నిమిత్తం అమ్మవారి ఊరు రత్తకన్న గ్రామం వెళ్లిన గీతా అక్కడే ఉంటోంది. ఈనెల 10న బాబు పుట్టినరోజు ఉండడంతో అత్త వారింట్లో అడుగుపెట్టి, అటు నుంచి మంగళవారం బాబు తండ్రి పనిచేస్తున్న బిలాయ్‌కు వెళ్లి అక్కడే పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలనుకున్నారు. అత్తారిల్లు కవిటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న బాబు కాటుక డబ్బా మూతను నోటిలో పెట్టుకోగా, అది గొంతులోకి వెళ్లి చిక్కుకుపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానికంగా వైద్యం అందించారు. పరిస్థితి చక్కబడక పోవడంతో వెంటనే ఇచ్ఛాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాబు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని కలచివేయగా గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. పుట్టిన రోజు పండుగ జరుపుకునేందుకు సిద్ధమవుతున్న ఆ తల్లి ఆర్తనాదాలు అందరిని కంటతడి పెట్టించాయి.











