పోలీసులకో చిత్రమైన కేసు ఎదురైంది. 9 నెలలు నిండిన ఓ మహిళ డెలివరీ కోసమని తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించి 2 రోజుల్లో డెలవరీ డేటు ఇచ్చి ఆసుపత్రి వర్గాలు ఆ మహిళను ఆసుపత్రిలో చేర్చుకున్నారు. డెలవరీ అయిన తర్వాత తమ బిడ్డ మాయమైందని ఆ జంట ఆసుపత్రిని నిందించడం మొదలుపెట్టారు. దీంతో ఆమెకు అసలు గర్భమే లేదంటూ పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు చేశారు. సిబ్బంది ఫిర్యాదుతో ఆ మహిళ అసలు గర్భం దాల్చిందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గర్భం దాల్చిన సమయంలో సీమంతం చేయించుకున్న ఫొటోలను విడుదల చేశారు బాధిత కుటుంబం. దీంతో అవాక్కవడం పోలీసులవంతైంది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, గర్భం దాల్చిన సమయం నుండి గూడూరులో మైథిలి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తుంది. ఆసుపత్రిలో డెలవరీ కోసమని నిన్న రాత్రి వచ్చి చేరిన సమయంలో టెస్ట్ లు చేయించుకోలేదని ఆసుపత్రి వర్గాలు ఆరోపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డాక్టర్లు సైతం ఆమె డెలవరీని ధృవీకరించడం లేదని పోలీసులు చెప్తున్నారు. వేరొక రిఫరెల్ ఆసుపత్రికి పంపి అసలు ఆమెకు డెలివరీ అయిందా లేదా అనేది నిర్థారణ చేసుకున్న తర్వాత ఆమె బిడ్డను గురించిన విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు డెలివరీ జరిగిందా లేదా నిర్ధారణ చేసుకోవడానికి డాక్టర్లను సంప్రదిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.











