కొవిడ్ సమయంలో పేదలను ఆదుకునే లక్ష్యంతో ఏర్పాటైన పీఎం కేర్స్ ఫండ్ నిధుల విషయంలో పారదర్శకత లోపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తూ.. ఏకంగా వంద మంది మాజీ ఐఏఎస్‌లు లేఖ రాయడం సంచలనంగా మారింది. రిటైర్డ్ ఐఏఎస్‌లు బీఎస్ బెహర్, కె.సుజాతారావు, ఏఎ దౌలత్ , అనితా అగ్నిహోత్రి, శరద్ బెహార్‌లతో పాటు 100 మంది రిటైర్డ్ ఐఏఎస్‌లు బహిరంగ లేఖ రాశారు. కొంత కాలంగా ఈ నిధి విషయంలో జరుగుతున్న అంశాలను తాము పరిశీలిస్తున్నామని, జవాబుదారీతనం లోపిస్తోందనే అభిప్రాయానికి తాము రావాల్సి వస్తోందని, చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
జరిగింది ఇదీ..
పీఎం కేర్స్ ఫండ్‌కి వచ్చిన విరాళాల వివరాల కోసం సామాజిక కార్యకర్తలు, సమాచార హక్కు చట్టం ప్రకారం సీఎం కేర్స్ ఫండ్‌కి లేఖ రాశారు. అయితే, ఈ సంస్థ పబ్లిక్ అథారిటీ కాదని సమాధానం వచ్చింది. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2H ప్రకారం వివరాలు ఇవ్వడం కుదరదని పేర్కొన్నారు. దీంతో వివాదం తలెత్తింది. పీఎం కేర్స్ ఫండ్ ప్రజాసంస్థ కాదని చెబుతున్నారని, అలాంటప్పడు ప్రధాని, కేంద్ర హోం మంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రులతోపాటు ప్రభుత్వంలోని ముఖ్యులు ఈ సంస్థలో కీలక పదవుల్లో ఎందుకున్నారని ప్రశ్నిస్తూ ఐఏఎస్‌లు లేఖ రాశారు. ఇలాంటి సమాధానం ఇవ్వడంతో ప్రజలకు పీఎం కేర్ పట్ల పలు అనుమానాలు వచ్చే ఆస్కారం ఉందని వెల్లడించారు. దీంతో పీఎం కేర్స్ ఫండ్ పబ్లిక్‌ది కానప్పుడు అది ప్రైవేటుదే అవుతుందనే చర్చ మొదలైంది.
గతంలోనే కాంగ్రెస్ ఆరోపణ..
కాగా గతంలో కొవిడ్ సమయంలో బాధితులకు సహాయం చేసేందుకు పీఎం కేర్ ఫండ్‌ని ఏర్పాటు చేసి విరాళాలు సేకరించారు. ఆ టైంలోనే కాంగ్రెస్ నుంచి విమర్శలు వచ్చాయి. సీనియర్ కాంగ్రెస్ లీడర్ అభిషేక్ సింఘ్వి గత ఏడాది జూన్‌లో దీనిపై సంచలన ఆరోపణలు చేశారు కూడా. పీఎం కేర్‌కు చైనా కంపెనీల నుంచి విరాళాలు వస్తున్నాయని, ప్రధాని మాత్రం చైనా మొబైల్ యాప్‌లను బ్యాన్ చేయడం, మేడిన్ ఇండియా, లోకలైజేషన్ నినాదాలు తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.
ప్రజాసంస్థ కానప్పుడు ఈ పేరెందుకు..
ఇక పీఎం కేర్స్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ పేరుతో నిధి ఏర్పాటు చేశారు. అంటే ప్రధాని హోదాతో ఈ నిధిని ఏర్పాటు చేశారు. ఏకంగా ప్రధాని మోదీ కూడా దీనిపై మాట్లాడారు. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విరాళాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఐదురోజుల్లోనే దాదాపు రూ.3వేల కోట్లు జమైనట్టు ప్రచారం జరిగింది. తరువాతి కాలంలోనూ భారీగా విరాళాలు వచ్చాయి. ఈ విరాళాల వివరాలు, ఖర్చుల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన ట్రస్టీలు.. ప్రజాసంస్థ కాదని చెబుతూ.. వివరాలు ఇచ్చేందుకు నిరాకరించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఐఏఎస్‌లు లేఖ రాశారు. మొత్తం మీద పీఎం కేర్స్ ఫండ్ విషయంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు మరో రాజకీయ వివాదంగా మారనుంది.