బ్యాడ్ బాయ్ బిలియనీర్ – ఇప్పుడీ వెబ్ సిరీస్ పెద్ద సంచలనమే అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కావలసిన ఈ సిరీస్ మొదటి రోజే బ్రేక్ పడింది. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ లో ఏముంది? సత్యం రామలింగరాజు దీనిపై కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?… ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ముందు ఓ సారి ఆ వెబ్ సిరీస్ పై దృష్టి సారిద్దాం. వైట్ కాలర్ నేరగాళ్లు ఈ సమాజంలో చాలామందే ఉన్నారు. వారు షేర్ మార్కెట్ ను కొల్లగొట్టగలరు.. బ్యాంకులను బురిడీ కొట్టించి ఎంచక్కా విదేశాలకు చెక్కేయగలరు… అప్పనంగా వచ్చిన సొమ్ముతో అమ్మాయిలతో జల్సాలు చేసేసుకోగలరు.
ఈ బ్యాడ్ బాయ్ బిలియనీర్ ప్రధాన కథాంశం ఇలాంటివారి గురించేనట. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు ఇలాంటి వైట్ కాలర్ నేరగాళ్లు ఈ సిరీస్ పై గుర్రుగా ఉన్నారు. నిజానికి దీనిపై సత్యం రామలింగరాజు కోర్టుకు వెళ్లడం ఎంతవరకు సబబో అర్థంగావడం లేదు. ఇది తన గురించే తీశారని, దీన్ని ప్రసారాన్ని వెంటనే ఆపివేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ తరహా ఆరోపణలకు సంబంధించిన తనపై ఇంకా విచారణ కొనసాగుతున్నందున తనను నేరస్తుడిగా చూపించే ప్రయత్నాల్లో భాగంగా ఈ వెబ్ సిరీస్ తీశారని ఆయన ఆరోపిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ మాత్రం ఇవన్నీ తమ పరిశోధనాత్మక కథనాలని పేర్కొంటోంది.
హైదరాబాద్ సివిల్ కోర్టు నెట్‌ఫ్లిక్స్ తన వెబ్ సిరీస్ ‘బాడ్ బాయ్ బిలియనీర్స్-ఇండియా’ ప్రసారం చేయకుండా తాత్కాలిక మధ్యంతర స్టే జారీ చేసింది. సత్యం కంప్యూటర్స్ కు సంబంధించి 7వేల కోట్ల అకౌంటింగ్ కుంభకోణంలో దోషిగా తేలిన రామలింగరాజు ఆ వెబ్ సీరీస్ ఆపమనడంతో కోర్టు నెట్ ఫ్లిక్స్ కు ఈ ఆదేశాలు జారీచేసింది.
ఒక్క రామలింగరాజే కాదండోయ్ ఈ సిరీస్ ఆపమని కోరుతున్నవారు ఇంకా చాలామందే ఉన్నారు. బ్యాంకులను, జనాన్ని మోసగించి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా , సహారా సుబ్రతా రాయ్, పీఎన్ బీ స్కాం లో నిందితులైన నీరవ్ మోదీ , మెహుల్ చోక్సీ లాంటి వారు ఎందరో దీనిపై పోరాడుతున్నారు.
సత్యం కుంభకోణం అంశాలు ఉన్నాయన్నఅనుమానంతోనే రామలింగరాజు కోర్టును ఆశ్రయించారు. దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న దశలో సత్యం కంప్యూటర్స్‌ను స్థాపించారాయన. ఆ సంస్థను.. నాస్‌డాక్‌లోనూ లిస్ట్ చేయించగలిగారు. మధ్యలో సంస్థ నుంచి నగదును రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు మళ్లించడం, లాభాలు .. ఆదాయాలు ఎక్కువగా చూపడం వంటి వాటికి పాల్పడి ఊబిలో కూరుకుపోయారు. ఈ అంశాలన్నీ బ్యాడ్ బాయ్ బిలియనీర్ లో ఉన్నాయన్నది ఆయన అనుమానం. కోర్టు కూడా ఆయనతో ఏకీభవించి వెబ్ సిరీస్ ప్రసారంపై స్టే విధించింది.
మిగతావారి సంగతికి వద్దాం. బీహార్ దిగువ కోర్టు నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్‌లో వ్యాపారవేత్త సుబ్రతా రాయ్ పేరును ఉపయోగించకుండా నిరోధించింది. బీహార్ దిగువ కోర్టు ఉత్తర్వుపై నెట్‌ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఇంకోపక్క బాడ్ బాయ్ బిలియనీర్స్ ప్రీ స్క్రీనింగ్ నిర్వహించాలని, దాదాపు రెండు బిలియన్ డాలర్ల పిఎన్‌బి కుంభకోణంలో నిందితుడైన మెహుల్ చోక్సీ వేసిన పిటిషన్‌ను ఆగస్టు 28న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
విజయమాల్యా, నీరవ్ మోదీ లాంటి వారు మాత్రం ఈ వెబ్ సిరీస్ సీరియస్ గా తీసుకోలేదు. అయినా ఎడాపెడా బయోపిక్ లు వచ్చేస్తున్న ఈ కాలంలో వీటి ప్రసారాలను ఆపలేరన్నది ఎప్పుడో స్పష్టమైంది. రామ్ గోపాల్ వర్మ అనేక మందిపై తీసిపారేస్తున్నారు, ఆయనపైనా అనేకం వచ్చేస్తున్నాయి. ప్రసారం ఆలస్యమవుతుందేమోగాని ఆపటం మాత్రం సాధ్యమయ్యే పనిగా కనిపించడం లేదు. చూద్దాం… ఈ బ్యాడ్ బాయ్ బిలియనీర్ ఏంచేస్తాడో.