ఈ మధ్యే అనారోగ్యంతో రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు చనిపోయినప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK107 సినిమా కోసం విదేశాలలో.. టర్కీ షెడ్యూల్ లో ఉన్నారు బాలకృష్ణ . అందుకే అప్పుడు ఆయన పార్దివ దేహాన్ని చూడడానికి రాలేకపోయారు.
షూటింగ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు తన భార్య వసుంధర దేవితో సహా వచ్చి కృష్ణంరాజు గారి కుటుంబాన్ని పరామర్శించారు. ఎన్నో సంవత్సరాలుగా తమ మధ్య విడదీయరాని అనుబంధం ఉందని.. నాన్నగారి సమయం నుంచి కృష్ణంరాజు గారిని చూస్తూ పెరిగానని అంటూ సినిమా ఇండస్ట్రీకి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు బాలకృష్ణ.
అలాంటి అద్భుతమైన నటుడితో తను కూడా కలిసి నటించే అవకాశం వచ్చిందని.. తామిద్దరం సుల్తాన్, వంశోద్ధారకుడు సినిమాలలో కలిసి నటించాననే విషయం గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయనతో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. కృష్ణంరాజు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ కుటుంబ సభ్యులను ఓదార్చి ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. రెబల్ స్టార్ ఫ్యామిలీతో చాలాసేపు ముచ్చటించారు బాలకృష్ణ, వసుంధరా దేవి దంపతులు.











