గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లు సమాచారం. కరోనా వ్యాధితో బాధపడుతున్న బాలు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇంకా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేన్స్ ఆక్సిజన్ (ఈసీఎంవో) సపోర్టుతో ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ఆయన బాగానే స్పందిస్తున్నట్లు వైద్యులు అంటున్నారు.
బాలు కోలుకోవాలని సినీ పరిశ్రమ ప్రార్థనలు
బాలు త్వరగా కోలుకోవాలని ప్రపంచవాప్తంగా అందరూ కోరకుంటున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా బాలు ఆరోగ్యం గురించి బాధపడుతూ ప్రకటనలు చేశారు. అయితే ఆయన త్వరగా కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు చేసేందుకు తమిళ చిత్ర పరిశ్రమ సమాయత్తమైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బాలు అభిమానులంతా సామూహిక ప్రార్థనలు చేయాలని తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు పిలుపునిచ్చారు.
రజనీకాంత్, కమల్ హాసన్, సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, దర్శకులు భారతీరాజా, రచయిత వైరముత్తు ఈ ప్రకటన విడుదల చేశారు. బాలు అభిమానులంతా ఎవరికి వాళ్లు తమ ఇళ్లలోనే ఉండి ఆయన పాడిన పాటలను వినాలని, ఆయన గళాన్ని మనమంతా వినేలా చేసుకోవాలని కోరారు. తమిళ పరిశ్రమకు చెందిన కళాకారులు, కార్మికులంతా ఈ సాయంత్రం 6 గంటలకు ఒక నిమిషం పాటు ప్రార్థన చేయబోతున్నట్లు తెలిపారు. బాలు త్వరగా కోలుకోవాలని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి బాలుపై ప్రత్యేకంగా ఓ వీడియో కూడా విడుదల చేశారు.










