నటి కస్తూరి కమల్ హాసన్, నాగార్జున, బాలకృష్ణ, మోహన్ బాబు సరసన నటించారు. కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే ఆమె సినిమాలకు స్వస్తి పలికి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. చాలా రోజులు యూఎస్ లో ఉన్న ఆమె సినిమాల మీద అభిరుచితో తిరిగి ఇండియా చేరుకున్నారు. తాజాగా ‘అలీతో సరదాగా’ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను మిస్ ఇండియా ఫైనలిస్టు అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలియచేశారు. సుష్మిత సేన్, ఐశ్వర్య రాయ్ లతో తాను పోటీపడ్డానని కానీ వారికున్న అందం ముందు తాను తేలిపోయానని ఆమె తెలిపారు. వారికున్న అందం వల్లే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ గా ఎంపికయ్యారని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు తెలుగు బాగా రావడానికి కారణం అమెరికానే కారణమని చెప్పారు. అమెరికాలో తెలుగు వారు ఎక్కువని చెప్పిన ఆమె వారితో మాట్లాడం వల్ల తెలుగు వచ్చేసిందని చెప్పారు. ఇదే సమయంలో భారతీయుడు సినిమాలో నటించిన సమయంలో తన వయసు 16 సంవత్సరాలని సీక్రెట్ బయట పెట్టేసింది. ఆ సినిమా అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని ఆమె తెలిపారు.
నాగార్జునతో తాను ప్రేమలో పడ్డానని తెలిపిన ఆమె ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. షూటింగ్ సమయంలో నాగ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడని దీంతో ఆ చేతిని నేను నెక్స్ట్ రోజు వరకు వాష్ చేయలేదని వెల్లడించారు. క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని ధోని అంటే పడి చస్తానని పేర్కొన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తాను తల్లి పాత్రలను చేసేందుకు ఇష్టపడనని అన్నారు. ఒకవేళ తప్పని పరిస్థుతులలో చేయవలసి వస్తే హీరో తండ్రిగా, కొడుకుగా నటిస్తేనే చేస్తానని నవ్వులు పూయించారు. తన కెరీర్ లో సింధూరం, ఆమె సినిమాలను డేట్స్ అడ్జెస్ట్ చేయలేక వదులుకున్నానని అదే తాను చేసిన పెద్ద తప్పని ఆమె తన బాధను వ్యక్తం చేశారు. తాను స్కూలుకు వెళ్లే సమయంలో నటి రమ్యకృష్ణ సినిమాలలో నటిస్తున్నారని ఇప్పటికీ కూడా ఆమె నటిస్తున్నారని అన్నమయ్య సినిమాలో ఆమెతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతని ఆమె వెల్లడించారు.