భారతీయ జనతా పార్టీ తెలంగాణా శాఖకు కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎంపికై రెండు నెలలు గడుస్తోంది. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినది మొదలు ఆయన తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పాలన మీదా… ముఖ్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీద ఒంటి కాలిపై లేస్తున్నారు. రాష్ట్రంలో పాలన భ్రష్టు పట్టిందంటూ తెల్ల వారి లేచినప్పటి నుంచి చేతిలో మైకు పట్టుకుని విమర్శలు సంధిస్తున్నారు.
హైదరాబాద్‌లో వర్షాలు, కరోనా వైరస్ కట్టడిపై ప్రభుత్వ విఫలం, సీఎం ఫాం హౌస్‌కు పరిమితమయ్యారనడం నుంచి వరంగల్‌ను ముంచెత్తిన వర్షాలు, వరదల వరకూ ఆన్నీ ఆయనే అయి తిరుగుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడుతున్నారు. ఎక్కడి వెళ్లినా ముక్కుకి మాస్కులు తొడుక్కుని కార్యకర్తల సమావేశాల్లోనూ, విలేకరుల సమావేశాల్లోను విమర్శలు గుప్పిస్తున్నారు.
వరంగల్ పర్యటనలో అయితే ముఖ్యమంత్రిని నిలదీయండి అంటూ ప్రజలకు పిలుపినిచ్చారు. ఇక హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో అయితే వారానికి కనీసం రెండు విలేకరుల సమావేశాలు పెడుతున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. ప్రభుత్వాన్ని ఇంతలా విమర్శిస్తున్నా అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఏకాకిలా ఒక్కరే మాట్లాడుతున్నారంటూ పార్టీలో ఆయన వర్గీయులు వాపోతున్నారు.
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ తెలంగాణాలోని సీనియర్ కమలనాధులెవ్వరూ పార్టీ కార్యాలయానికి వచ్చి ఒక్క గంట కూడా గడపలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కే.లక్ష్మణ్ అయితే తొంగి చూసి వొంగి వాలిన సందర్భాలు లేవు. పార్టీకి ఉన్న నలుగురు ఎంపీల్లో ఒకరు కేంద్ర మంత్రి జీ, కిషన్ రెడ్డి. ఆయనకు దేశమంతా తిరిగే పని కాబట్టి ఆయన్ని మినహాయించినా మిగిలిన ముగ్గురు ఎంపీలలో ఒకరు సాక్షాత్తూ అధ్యకుడు బండి సంజయ్. మిగిలిన ఇద్దరు ఎంపీలలో ధర్మపురి అర్వింద్ కాని అదిలాబాద్ ఎంపీ సోయెం బాపూరావు కాని ఒక్కసారి కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి రాలేదు.
పార్టీ సీనియర్ నాయకులై ఇంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రామచంద్రరావు, డీ.కే.అరుణ, పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ వంటి వారైతే పార్టీ కార్యాలయానికి వచ్చి నెలలు గడుస్తోందంటున్నారు. ఏ సీనియర్ నాయకుడు కూడా అధ్యక్షుడు బండి సంజయ్ కు సహకరించడం లేదని క్షేత్రస్ధాయి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.
పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఇంకా పూర్తిగా ప్రకటించకుండానే పరిస్థితి ఇలా ఉంటే కార్యవర్గాన్ని ప్రకటించిన తర్వాత ఎవరు ఎటు వైపు ఉంటారోనని పార్టీలో సీనియర్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధ్యక్షుడు బండి సంజయ్‌కు సహకరించాలని, ఆయన పిలుపునిచ్చిన ఉద్యమాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలని పార్టీ అధిష్టానం హెచ్చరించే వరకూ ఇలాగే ఉంటారా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర శాఖలో ఇప్పటికే రెడ్డి వర్గం, బలహీన వర్గాలకు చెందిన నాయకుల వర్గంగా అంతర్గతంగా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడి వర్గం కూడా తయారైతే అది పార్టీకి బలాన్నివ్వకపోగా అధికార టీఆర్ఎస్ కు మరింత బలం చేకూరుస్తుందని సీనియర్ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.
ఇక ముందు ముందు పార్టీ చేపట్టి ఏ కార్యక్రమాన్నైనా ముందుకు తీసుకువెళ్లాలంటే ‘బండి’ మాత్రమే కదిలితే సరిపోదని, మిగిలిన నాయకులు కూడా సహకరిస్తేనే పార్టీ బలపడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.