సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా జరుగనున్న నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణను నిలిపివేయించడం ద్వారా ప్రతిపక్షాలు అధికార బీజేపీని ఇరుకున పెట్టాలనుకుంటున్నాయా…? దేశంలో కరోనా విజృంభిస్తున్న నేటి తరుణంలో లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలతో ఆడుకోవద్దంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా వివిధ రాఫ్ట్రాలలో ఉన్న బీజేపీయేతర పార్టీలు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటున్నాయా…? తాజా పరిణామాలను గమనిస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తున్నాయి.
బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ నూతర అధ్యక్షురాలు సోనియాగాంధీతో పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, పలు పాంత్రీయ పార్టీలకు చెందిన నాయకులు వీడియో కాన్షరెన్స్ లో చర్చించుకున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1 నుంచి జరుగనున్న నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను నిలుపుదల చేయాలంటూ అన్ని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పంజాబ్, ఝార్ఖండ్, పుదుచ్చేరి, రాజస్థాన్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను సుప్రీంకోర్టును ఆశ్రయిద్దామా అని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ సూచించినట్లు సమాచారం. దీనిపై వారితో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఏకీభవించినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే ఒకసారి నీట్, జేఈఈ పరీక్షల వాయిదాపై కేంద్రానికి తాను లేఖ రాసానని, అయితే కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదని మమతా బెనర్జీ ఈ సమావేశంలో వెల్లడించారు. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒక్కటే మార్గమని మమతా బెనర్జీ తన అభిప్రాయం వెల్లడించారు. ఆమె అభిప్రాయంతో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ఏకీభవించారు. అమెరికాలో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోందని, ఇక్కడ కూడా అలాగే జరిగితే ఏం చేయలేమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే అభిప్రాయపడ్డారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అయితే ఓసారి ప్రధానిని, రాష్ట్రపతిని కలిసి పరిస్థితి తీవ్రతను తెలియజేయాలని అబిప్రాయపడ్డారు.
మరోవైపు ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ రాహుల్ గాంధీతో పాటు బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, డీఎంకే నేత స్టాలిన్, ఉద్దవ్ థాక్రే కేంద్రానికి లేఖ రాశారు. విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని వాయిదా నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. దీని వల్ల రాజకీయంగా కూడా ప్రయోజనం ఉంటుందని ఆయా నాయకుల ఆలోచనగా చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కేంద్రం తీసుకుంటున్న మొండివైఖరి తేటతెల్లం అవుతుందని, ప్రతిపక్షాలు ఎంత నైతిక బాధ్యతతో వ్యవహరిస్తున్నాయో తెలుస్తుందని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఆలోచనగా ఉంది.
ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతు పలకాల్సిందిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర రావు, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులను కూడా మద్దతు తెలపాల్సిందిగా కోరే అవకాశం ఉంది. కేరళ ముఖ్యమంత్రితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రీ కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందని అంటున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కరోనాతో స్టార్ హీరోగా మారిన నటుడు సోనూ సూద్ కూడా నీట్, జీఈఈ పరీక్షలు వాయిదా వేయాలనే నిర్ణయానికి మద్దతు పలికారు.