కొన్ని రోజులుగా ఏపీలో డిక్లరేషన్ అంశంపై జరుగుతున్న రాజకీయ దుమారం అంతా ఇంతా కాదు. అక్కడ అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలకు మద్య మాటాల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. అయితే తిరుమల శ్రీవారి ఆలయ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల పట్ల రాజకీయ జోక్యంతో వివాదాలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు అనాదిగా వస్తున్నాయన్నారు. మత విశ్వాసాల్లోని లోటుపాట్లను విచారించేది, శాస్త్ర పద్ధతుల్లో చర్చించేది పీఠాధిపతులు, స్వామీజీలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నేతలు తలదూర్చడం భావ్యం కాదని బండి సంజయ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతర్వేదిలో రథం కాలిపోతే ఒక చెక్క కాలిపోయిందంటూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా అక్కడి నాయకులు మాట్లాడటం దారుణమన్నారు. సమాజంలోని అన్ని వర్గాల్ని సమదృష్టితో చూడాల్సిన పాలకులు.. సున్నితమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. మత విశ్వాసాలు, ఆచార సంప్రదాయాల్లో రాజకీయ నేతలు కలుగజేసుకుంటే వారి భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారని బండి సంజయ్ హెచ్చరించారు.
ఏపిలో జరిగే చర్యలపై దేశవ్యాప్తంగా హిందూ సమాజం వ్యతిరేకిస్తున్నా, స్పందిస్తున్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాల్సిన నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాల్సిన నేతలు మౌనం వహించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు.










