ఆత్రగానికి బుద్ధి మట్టు అంటారు. నవంబరు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి తీరాలనే ఆత్రంలో డోనాల్డ్ ట్రంప్ వివేకాన్ని పక్కనపెట్టేసినట్లున్నారు. కొవిడ్ టీకాలు భద్రమైనవని తేలకముందే, వాటిని ఓటర్లకు వేయడానికి రెడీ అవుతున్నారు. కాగా, అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ తోపాటు వ్యాక్సిన్ తయారీదారులు కూడా కొవిడ్ టీకాలు భద్రం, సమర్థం అని తేలిన తరవాతనే వాటిని విడుదల చేస్తామంటున్నారు. కానీ, ట్రంప్ ప్రభుత్వం తనకున్న అధికారాలతో ఈ ప్రక్రియను అవతలకు నెట్టి హుటాహుటిన టీకాను మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ట్రంప్ ఆశలకు దగ్గరగా వచ్చే వ్యాక్సిన్ ఏదైనా ఉందీ అంటే, అది ఫైజర్-బయాన్ టెక్ సంస్థల సంయుక్త టీకా మాత్రమే. ఫైజర్ అమెరికా కంపెనీ కాగా, బయాన్ టెక్ జర్మన్ సంస్థ. తమ వ్యాక్సిన్ సామర్థ్యమెంతో అక్టోబరు నెలాఖరుకే తెలిసిపోతుందనీ, నవంబరు లేదా డిసెంబరులో దాన్ని మార్కెట్‌కు విడుదల చేయగలమని ఈ సంస్థలు ప్రకటించాయి. మరి ఆ గడువు ట్రంప్ గెలుపునకు ఉపయోగపడుతుందా అన్నది చూడాలి. అమెరికన్ కంపెనీ మాడెర్నా ఈ ఏడాది డిసెంబరు లేదా 2021 జనవరిలో టీకా విడుదల చేయగలనని వివరించింది. బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం-ఆస్ట్రా జెనెకా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఆరంభంలో జనసామాన్యానికి అందుబాటులో రానుంది.
టీకా అస్త్రంతో ట్రంప్ అమెరికా ఎన్నికల్లో మళ్లీ గెలవాలని తొందరపడుతుంటే, రష్యా, చైనా అధినేతలు ప్రపంచంలో అందరికన్నా ముందు కరోనా మహమ్మారికి ముకుతాడు వేసిన ఘనతను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. చైనాలో ఇప్పటికే లక్షలాది ప్రజలకు మూడు ప్రయోగాత్మక వ్యాక్సిన్లను వేశారు. నవంబరుకల్లా సాధికారంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని బీజింగ్ చెబుతోంది. రష్యాలో కూడా ఒక వ్యాక్సిన్‌ను ప్రజలకు వేస్తున్నారు. జనవరిలో అది అందరికీ అందుబాటులోకి వస్తుందని రష్యా ప్రభుత్వం ప్రకటించి ఉంది.
జగన్ ఆలోచనకు ముందే జైకొట్టిన చంద్రబాబు
ప్రస్తుతం ప్రపంచమంతటా 175కి పైగా కరోనా టీకాలపై ప్రయోగాలు జరుగుతున్నా, వాటిలో కొన్ని మాత్రమే విజయవంతంగా మార్కెట్‌లోకి వస్తాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యా, చైనాలు ఈ ఘనతను సొంతం చేసుకోవడానికి పోటీపడుతున్నాయి. చైనా, రష్యాలు తమ సొంత వ్యాక్సిన్లను ఈ ఏడాది ముగిసే లోపే జనానికి అందిస్తామంటున్నా, పాశ్చాత్య దేశాలు ఆ టీకాలపై బోలెడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏతావతా ఎవరు సరైన టీకాతో ముందుకొస్తే, ఈ సువిశాల ప్రపంచ విపణిలో వారికే ఆధిక్యం లభిస్తుంది. ప్రపంచంలోని 780 కోట్ల జనాభాకు కరోనా టీకాను కనీసం రెండు మోతాదులు వేయాల్సి రావచ్చు. మొత్తం 1600-1900 కోట్ల డోసులకు గిరాకీ ఉంటుందని అంచనా. యూనిసెఫ్ పంపిణీ చేసే టీకా రూ. 225 కు లభిస్తే, ఫార్మా కంపెనీలు మార్కెట్ చేసే టీకా ఒక్కో మోతాదు ధర రూ. 1000 నుంచి రూ. 2,400 వరకు ఉండవచ్చునని అంటున్నారు. ఇంతటి విస్తృత మార్కెట్ కోసం ప్రస్తుతం పోటీ నడుస్తోంది.
– అర్జున్