రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) నోటిదురుసు ఇప్పుడు ఆయన మంత్రిపదవికి ఎసరు పెట్టే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నమ్మినబంటు, ప్రీతిపాత్రుడు అయిన కొడాలి నాని మొదటి నుంచి వివాదాస్పద వ్యక్తి.
ఆయన పదవికి భాజపా స్వయంగా గండంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పధాదికారుల సమావేశంలో మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలంటూ తీర్మానం చేశారు. తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీ లు సైతం మంత్రి కొడాలి నాని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆచారాలు, సాంప్రదాయాలుపై చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా మoడిపడుతూ కొడాలి నానిని మంత్రివర్గo నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన మంత్రి పదవికే ముప్పు వచ్చే ప్రమాదం ఏర్పడింది.
మత విశ్వాసాలను రెచ్చగొట్టే విధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా మంత్రి కొడాలి నాని మాట్లడటం వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అంతేగాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకస్మాతుగా ఢిల్లీ పర్యటన వెనుక రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు కారణం అయివుంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఆర్.ఎస్.ఎస్., భజరంగ్ దళ్, విశ్వా హిందూపరిషత్ వంటి సంస్థలు పాత్రకూడా వుండి ఉండవచ్చునని భావిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరస హిందూ దేవాలయాల పై దాడులు, దీనిపై మంత్రుల వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ పార్టీ అధిష్టానం కు ఫిర్యాదు చేసిఉంటుందని, జగన్ తన ఢిల్లీ పర్యటనలో కేంద్రానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుందని కూడా అంచనాలు సాగుతున్నాయి.
అదంతా ఒక పార్శ్వం అయితే కొడాలినాని చుట్టూ రేగుతున్న వివాదం మరో ఎత్తు. జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు అయిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కూడా ఆయన మాటలు, వ్యాఖ్యల పట్ల ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబును నాని తిడితే.. అది వారికి బాగానే ఉంటుంది గానీ.. హిందూ మతానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు పార్టీకి చేటుచేస్తాయని జగన్ అభిమానుల ఆగ్రహం. నానిమీద పార్టీ చర్య తీసుకోవాల్సిదేనని అభిలాష కార్యకర్తలు పలువురిలో వ్యక్తం అవుతోంది.