విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు వైయస్సార్ వైఎస్సార్సీపీలో చేరబోతున్నారు అన్న ప్రచారంతో బెహరా భాస్కరరావు వర్గం లోనూ… అటు మళ్ళ విజయప్రసాద్ వర్గాల్లోనూ ఒక రకమైన ఆందోళన కనబడుతోంది.
మాజీ కార్పొరేటర్ బెహరా భాస్కరరావు కు గ్రేటర్ విశాఖ 66, 67, 68 వార్డుల్లో మంచి పట్టు ఉంది. ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన వర్గం 2014 ఎన్నికల్లో భారీ ర్యాలీ చేపట్టింది. సుమారు ఆరువేల ఆటోలతో చేసిన ర్యాలీ అప్పటి కాంగ్రెస్ అధిష్టానం దృష్టిని కూడా ఆకర్షించింది. అయితే కుల సమీకరణాలు కారణంగా ఆయనకు టిక్కెట్ లభించలేదు.
చాలా కాలం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గా నెట్టుకుంటూ వచ్చిన ఆయన ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సీపీ తీర్థం తీసుకున్నారు. ఎన్నో ఏళ్ల క్రితమే ఆ పార్టీ నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ ఆయనకు విజయప్రసాద్‌కు మధ్య ఉన్న విభేదాల కారణంగా పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున విజయ్ ప్రసాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించేందుకు బెహరా ప్రధాన కారణం. కానీ విజయం సాధించిన తరువాత మళ్ళ విజయప్రసాద్ తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.
ఒకానొక సమయంలో ఆయన ఆస్తులపై వ్యాపారాలపై ఫిర్యాదులు చేసుకునే వరకు వచ్చాయి. ఈ కారణంగానే బెహరా భాస్కరరావు వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరాలని లేదా జనసేన లో చేరాలని ఆయన అనుచర వర్గం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగినా ప్రయోజనం ఉండదు అన్న సమీకరణాలతో బెహరా వెనకడుగు వేశారు.
వైఎస్సార్సీపీ తరఫున కార్పొరేటర్‌గా బరిలో దిగి మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. కానీ ఆయన పోటీ చేయాల్సిన వార్డు మహిళకు కేటాయించడంతో ఆశలు అడియాశలు అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో నైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తున్న ఆయన కేడర్‌కు గణబాబు పార్టీలోకి వస్తున్నారనే వార్త పిడుగులా పడింది.
ఒకపక్క మళ్ళ విజయప్రసాద్, మరోపక్క గణబాబు నియోజకవర్గం లో ఉండగా, బెహరాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దాదాపుగా శూన్యం. ఇప్పుడు ఇదే అంశంపై ఆయన అనుచరవర్గాన్ని వేధిస్తోంది. ఇంకా ఎన్నాళ్లు ద్వితీయశ్రేణి నాయకులుగా కొనసాగాలన్న ఆందోళన కనిపిస్తోంది. అయితే గత కార్పొరేషన్.. సార్వత్రిక ఎన్నికల్లో గణబాబుకు, బెహరా కు ఉన్న సంబంధాల నేపథ్యంలో ఒకరికొకరు విజయంలో సహాయపడేవారు.
కులం పరంగా మైనస్..
పశ్చిమ నియోజకవర్గంలో కులాల పరంగా చూస్తే వరుసగా కాపు, గవర, యాదవ, ముస్లిం కులాల ఆధిపత్యం కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు ఇద్దరిదీ గవర సామాజిక వర్గమే. ఎమ్మెల్యే టికెట్ ఆశించే వారికి ఈ కులమే పెద్ద బలం.
బెహరా విషయానికి వస్తే ఆయన … పట్నాయక్ కావడంతో అవకాశాలు దక్కడం లేదు. ఆయనకు కలిసొచ్చే అంశం ఏదైనా ఉందంటే అది బీసీ కార్డు మాత్రమే. వార్డు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్నప్పటికీ గత 15 ఏళ్లుగా ఆయన కార్పొరేటర్ స్థాయిని మించి ఎదగలేక పోయారు. రాబోయే ఎన్నికల్లో నైనా ఆ అవకాశం వస్తుందనుకుంటే … ఎమ్మెల్యే గణబాబు ఎంట్రీ అయితే ఉన్న దారులు కూడా మూసుకు పోయినట్టే అని అనుచరులు భావిస్తున్నారు.