‘‘లెఫ్టో.. రైటో.. ముందుక్కో.. వెన్కక్కో..’’ అంటూ ‘అనుకోకుండా ఒకరోజు’ చిత్రంలో సాగే పాట గుర్తుందా? ఇప్పుడు తెలంగాణలో లెఫ్ట్ పార్టీల వ్యవహారం అచ్చంగా ఈ పాట లాగానే ఉంది.
లెఫ్టా…రైటా…అసలు తమ దారెటూ అన్నట్లుగా ఉంది కామ్రెడ్ల పరిస్థితి! ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల దారిపైన సర్వత్రా చర్చ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులకు కష్టకాలమే నడుస్తోంది. దేశంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎలా ఉన్నా రాష్ట్రంలో మాత్రం వారి పార్టీ పరిస్థితి మరింతగా దిగజారిందనే చెప్పుకోవాలి. కమ్యూనిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంది. దానిని కాపాడుకుంటూ ఎన్నికల్లో పోటీ చేస్తూ విజయం సాధించాల్సిందిపోయి..మిగతా పార్టీలతో అంటకాగుతున్నారనే విమర్శ వారిపై ఉంది. ఒకప్పుడు సిపిఐ, సిపిఎం పార్టీలకు కంచుకోటలుగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి? కమ్యూనిస్టుల కోటలకు ఇక బీటలు వారినయి అనుకోవచ్చా? అనే స్థాయికి కమ్యూనిస్టుల పరిస్థితి దిగజారిపోయింది. తమ సిద్ధాంతాలకు పక్కన బెట్టి ఎప్పటికప్పుడూ అధికార పార్టీలతో తెర ముందు గానీ, తెరవెనుక గానీ పొత్తులు పెట్టుకుని కాస్తో కూస్తో బలం చాటుకుంటూ వచ్చేవారు. గతంలో అవసరాలను బట్టి.. అవకాశవాదంతో అధికారంలో ఉన్నవారితో పొత్తులు పెట్టుకొని ఒకటి, రెండు సీట్లను సాధించుకుని చట్టసభల్లో పోయేవారు. అలనాటి చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రస్తుతం కెసిఆర్ వరకు ఇదే విధానాన్ని కామ్రెడ్లు అమలు చేస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టుల దారెటు? అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
రాష్ట్రంలో త్వరలో జరిగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో కమ్యూనిస్టుల దారెటు? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరగుగుతోంది. ఈ చర్చకు కారణం కూడా లేకపోలేదు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ, టిడిపి, టిజెఎస్ కూటమి ఏర్పాటు చేసుకొని ఎన్నికల బరిలో నిలిచాయి. అప్పటి నుంచి మొన్నటి వరకు ప్రజాసమస్యలపై ఉమ్మడిగానే కొన్ని కార్యక్రమాలను చేపట్టినవారు ప్రసస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమిలో ఉన్న పార్టీలు ఎవరి దారి వారిదన్నట్లుగా కనబడుతోంది. ఎవరికి వారుగానే సొంతంగా పోటీ చేయబోతున్నాయి. ఈ పోటీల వెనుక కూడా పెద్ద చర్చే నడుస్తోంది. సాధారణంగానైతే ప్రతి పక్ష పార్టీలు అన్ని కలిసి అయినా, లేదా వేరు వేరుగానైనా ఎన్నికల్లో పోటీ చేస్తుంటాయి. లేదా అధికార పక్షంతోనైనా పోటీ పెట్టుకొని బరిలో దిగుతాయి. కానీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీల తీరుతో చాలా ఇంట్రస్టింగ్ మారాయి. తెరముందు కత్తులు దూస్తూనే తెరవెనుక కలిసిపోయి ఎన్నికల బరిలో నిలిచేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇలాంటి కొత్త వ్యూహాలతో తమ ప్రత్యర్థులను ఓడించాలనే ప్రణాళికలతో వివిధ పార్టీలు ముందుకు పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టిజెఎస్ కు సిపిఐ మద్దతునిస్తుందనే చర్చ కూడా కొన్ని వర్గాల్లో జరిగింది. అయితే సిపిఐ కూడా తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఒకరిద్దరు జర్నలిస్టుల పేర్లను కూడా ఇందుకోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సిపిఎం కూడా తమ అభ్యర్థిని బరిలో దింపుతున్నట్లు సమాచారం. తెరవెనుక టిఆర్ఎస్‌తో మిలాఖత్‌లో భాగంగానే సిపిఐ, సిపిఎం బరిలో దిగి ఓట్లను చీల్చే విధంగా టిఆర్ఎస్ సరికొత్త ప్రణాళికను అమలు పరుస్తుందనే చర్చ జనాల్లో జోరుగా సాగుతోంది.
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నిక అంశం పరిశీలిస్తే…ఇక్కడ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎంఎల్‌సిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానానికి వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడి నుంచి టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ రామ్ పోటీ చేయాలనుకుంటున్నారు. విద్యార్థి, ఉపధ్యాయ, ఉద్యోగుల సంఘాల నాయకులతో, మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కూడగట్టుకునే పనిలో ఆయన ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ కంటే ఒకడుగు ఆయనే ముందున్నారు. అయితే ఈ సీటును ఎలాగైనా టిఆర్ఎస్ పార్టీ చేజిక్కుంచుకోవాలని భావిస్తోంది. దీని కోసం రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోదండ రామ్‌ను ఓడించేందుకు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎంతో కొంత పట్టున్న సిపిఐ, సిపిఎం అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు టిఆర్ఎస్ పావులు కదుపుతున్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం ఓట్లు చీల్చే కార్యక్రమంను టిఆర్ఎస్ పార్టీ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలా పోటీలో నిలవడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్ని పార్టీలకు చీలిపోయి అధికార పార్టీకి పరోక్షంగా ఇది లాభం చేకూరే పరిస్థితి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం పార్టీలు తనకు మద్దతివ్వాలని కోదండ రామ్ ఆ పార్టీలను కోరారు. అయితే పార్టీలో చర్చించి తమ అభిప్రాయాన్ని చెబుతామని కమ్యూనిస్టులు చెప్పడం గమనార్హం. కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను పక్కన బెట్టి అవకాశం, అవసరాల కోసం అధికార పార్టీలకు మేలుచేసే విధానాలకు పాల్పడుతున్నారనే విమర్శ వారిపై ఉంది.











