భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు వచ్చాకే వ్యాక్సిన్ విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పైనే దృష్టి సారించినట్లు భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ ఐవీ) భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.
సమర్థత, భద్రతకు సంబంధించి తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో కచ్చితమైన రుజువు లభించి నియంత్రణ సంస్థల అనుమతులు పొందిన తర్వాతే వ్యాక్సిన్ విడుదల చేస్తామని భారత్ బయోటెక్ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ సాయి ప్రసాద్ తెలిపారు. దీంతో వచ్చే ఏడాది 2021 రెండో త్రైమాసికంలోనే దీన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.
ఇప్పటికే కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాల కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి భారత్ బయోటెక్ కొద్ది రోజుల ముందే అనుమతి పొందినట్లు తెలిపింది. వాలంటీర్ల ఎంపిక, వ్యాక్సిన్ ప్రయోగాలను ఈ నెలలోనే ప్రారంభించి ఏర్పాట్లు జరుగుతున్నాయని భారత్ బయోటెక్ పేర్కొంది. ఇందు కోసం దేశంలోని 13 నుంచి 14 రాష్ట్రాల్లో దాదాపు 25 నుంచి 30 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇలా ప్రతి ఆసుపత్రి నుంచి దాదాపు 2 వేల మంది వాలంటీర్లను నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. ప్రయోగాల్లో భాగంగా వాలంటీర్లకు రెండు డోసుల వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారు.
ప్రయోగాల్లో భాగంగా వచ్చే ఆరు నెలల్లో వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి కావాల్సిన సదుపాయాల కోసం దాదాపు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు భారత్ బయోటెక్ పేర్కొంది. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వీటిని ప్రభుత్వ, ప్రైవేట్ మార్కెట్లకు సరఫరా చేసే ఆలోచనలో ఉన్నట్లు అభిప్రాయపడింది. అంతేకాకుండా వీటిని విదేశాల్లోనూ మార్కెట్ చేసే అవకాశాలపై ప్రాథమిక చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపింది. అయితే వ్యాక్సిన్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందును వ్యాక్సిన్ డోసు ధర పై మాత్రం ఇప్పుడే తుది నిర్ణయానికి రాలేదని పేర్కొంది. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పైనే ఉన్నట్లు భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.