అధికారంలో ఉన్న పార్టీకి ఏ ఎన్నికలైనా కాస్తంత బెరుకు ఉండటం సహజమే. ఎందుకంటే.. తమ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఎక్కడ బయటపడుతుందోనన్న భయం అధికార పార్టీ నేతలను వెంటాడుతుండటం తెలిసిందే. అయితే ఏపీ సీఎం జగన్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న భయం చూస్తుంటే.. ఉప ఎన్నికలంటే జగన్ భయపడినంతగా మరే నేత కూడా భయపడలేదనే చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు కేసీఆర్ అమితాసక్తి చూపిస్తున్నారు. అయితే తన సొంత జిల్లా కడపలోని బద్వేలు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి జగన్ వెళ్లనంటే వెళ్లనని జగన్ మారాం చేస్తున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఉప ఎన్నికలు జగన్‌ను ఏ మేర భయపెడుతున్న వైనంపై కూడా ఇప్పుడు చర్చ మొదలైపోయింది.
కరోనా సాకే కదా
బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారానికి రావడం లేదని, కరోనా విస్తరిస్తుందేమోనన్న భయమే ఇందుకు కారణమని జగన్ సోమవారం నాడు బద్వేలు ఓటర్లను ఉద్దేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగానే తాను ఉప ఎన్నికల ప్రచారానికి రావడం లేదని, అయినా తన పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని జగన్ ఆ లేఖలో కోరారు. ఏపీలోనే కాకుండా యావత్తు దేశవ్యాప్తంగా కరోనా విస్తృతి బాగా తగ్గిపోయింది. గతంలో ఏపీలో నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండగా.. ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య వందల్లోకి తగ్గిపోయింది. కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఉత్సాహం చూపిన జగన్.. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టినా.. కరోనాను సాకును చూపి ప్రచారానికి రావట్లేదని చెబుతున్న తీరు నిజంగానే అనుమానాలను రేకెత్తస్తోంది.
తిరుపతి బరిలోనే ఇదే మంత్రం
ఇటీవలే ముగిసిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సమయంలోనూ జగన్ ఇదే మంత్రాన్ని జపించిన సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ టికెట్‌పై తిరుపతి ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాదరావు హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. అయితే దీనిని ఊహించని జనన్.. బల్లి దుర్గాప్రసాదరావు సాధించిన మెజారిటీ కంటే కూడా అధిక మెజారిటీ సాధిస్తామని గొప్పలు చెప్పారు. అయితే అనూహ్యంగా అన్ని పార్టీలు రంగంలోకి దిగడంతో మెజారిటీ తగ్గిపోతే పరువు పోతుందనో, లేదంటే ఏకంగా తమ పార్టీ అభ్యర్థి గురుమూర్తి ఓడిపోతే పరిస్థితి ఏమిటని ఆలోచించిన నేపథ్యంలోనే జగన్ తిరుపతి బైపోల్స్ ప్రచారానికి రాలేదన్న వాదనలు వినిపించాయి. తాజాగా బద్వేలులో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీకి దూరంగా ఉన్నా కూడా విజయంపై ధీమా లేకనో, లేదంటే.. గతంలో వచ్చినంత మెజారిటీ రాదన్న భయంతోనే జగన్ ప్రచారానికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రచారానికి వెళితే.. ఎక్కడ జనంలో తన ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బయటపడుతుందోనని జగన్ భయపడుతున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.











