విజయనగరం జిల్లాలో అత్యంత పురాతనమైన, ఐదు దశాబ్ధాల చరిత్ర కలిగిన శ్రీ విజయరామ గజపతి సహకార చక్కెర (భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ) కర్మాగారం భవితవ్యం తేలక రైతులు ఆందోళన చెందుతున్నారు. 46 ఏళ్లుగా ఈ ప్రాంత చెరకు రైతులకు నిరంతర సహకారం అందించిన ఈ కర్మాగారం ప్రస్తుతం మూతపడింది. కర్మాగారంలోని యంత్రాలు పాతబడి మరమ్మతులకు గురవడంతో పనిచేసే స్థితిలో లేవు. దీంతో ఈ ఏడాది క్రషింగ్ నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కర్మాగారాన్ని ఆధునీకరించి వచ్చే సీజనుకు పూర్తి సేవలు అందిస్తామని హామీ ఇచ్చినా ఆ దిశగా చర్యలు కొరవడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక చెరకు రైతులకు ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. వచ్చే సీజన్ నాటికి ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని యాజమాన్యం చెబుతున్నప్పటికీ, చెరుకు రైతులకు నమ్మకం కలగడం లేదు. రానున్న సీజన్ లో చెరకు పంటను పండించాలా లేదా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. కనీస మద్ధతు ధర కరువవుతున్న పరిస్థితుల్లో అర్థంతరంగా ఫ్యాక్టరీని కూడా మూసివేయడంతో చెరకు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
రాష్ట్రంలో ప్రత్యేక స్థానం
దీర్ఘకాలిక చరిత్ర కలిగిన భీమసింగి షుగర్ ఫ్యాక్టరీకి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. విజయనగరం జిల్లా జామి, ఎల్ కోట, ఎస్ కోట, విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలాలకు చెందిన సుమారు 20 వేల మంది రైతులు ఈ ఫ్యాక్టరీపై ఆధారపడివున్నారు. సుమారు లక్ష నుంచి లక్షా ఏభై వేల టన్నుల చెరకు గానుగ ఆడే సామర్థ్యమున్న ఈ ఫ్యాక్టరీలో ఏడాదికేడాది సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. పాలకవర్గాల ఉదాసీనత, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరే దీనికి ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. గతంలో ఫ్యాక్టరీ కార్మికులు సైతం యాజమాన్యం వైఖరిపై అసంతృప్తిని వెళ్లగక్కిన ఉదంతాలు చాలా ఉన్నాయి. 46 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీలో యంత్రాల పనితీరు సంతృప్తికరంగా లేదని, కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కేన్ కమిషనర్, నేషనల్ ఫెడరేషన్ ఆదేశాల మేరకు ఈ ఏడాది క్రషింగ్ నిలపాల్సిన వచ్చిందని యాజమాన్యం చెబుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల నివేదికను అనుసరించి అధునాతన యంత్రాలతో వచ్చే సీజన్ నాటికి ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని యాజమాన్యం నమ్మబలుకుతున్నా రైతులకు నమ్మకం కుదరడం లేదు.
ఆచూకీ లేని త్రిసభ్య మంత్రుల కమిటీ
సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలను పరిశీలించి, వాటి స్థితిగతులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ బృందంలో విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు మంత్రులు గౌతంరెడ్డి, కన్నబాబు ఉన్నారు. వీరు నేటివరకూ ఈ ఫ్యాక్టరీని సందర్శించకపోవడంలో ఆంతర్యాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ప్రైవేటీకరించేందుకు కుట్ర
విజయనగరం జిల్లా రైతులకు ఎంతో ఉపయుక్తంగా, లాభసాటిగా ఉన్న ఈ కర్మాగారాన్ని నష్టాల బాట పట్టించి, ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని, దీన్ని కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక సతమతమవుతున్న రైతులకు ఫ్యాక్టరీ మూతపడటం ఆందోళన కలిగిస్తుండగా, ప్రైవేటీకరణ అంశం మరింత దిగులు పరుస్తోంది. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.