కరోనా వాక్సిన్ కనుగొనడంలో భారత్ జరుగుతున్న ప్రయోగాలు మంచి రిజల్ట్ ఇస్తున్నాయి. ఆశావహ వాతావరణంలో ముందడుగు పడుతోంది. మూడో దశ ప్రయోగాలకు కూడా అనుమతులు లభించాయి.
భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి లభించింది. కరోన వ్యాక్సిన్ పరిశోధనల్లో ఇది మరో పెద్ద ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ మూడోదశ ప్రయోగాల కింద.. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 19 వేర్వేరు ప్రాంతాల్లో 18ఏళ్లకు పైబడిన వారిపై భారత్ బయోటెక్ సంస్థ పరిశోధనలు చేయనుంది.
దేశీయంగా భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంస్థలు సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నాయి. కరోనా టీకా మూడో దశ ట్రయల్స్ అనుమతి కోసం అక్టోబర్ 2న డీసీజీఐకి భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఆ అనుమతి లభించింది.
జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవిడ్ టీకాకు రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. పుణెకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనికాతో కలిసి రూపొందిస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకాకు సంబంధించిన పరిశోధనలు రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి.
ఫిబ్రవరి నాటికి వస్తుందా?
మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు కూడా అడుగు పడడంతో.. భారత ప్రజల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఇప్పుడు అనుమతులు రావడం అంటే.. వీటిని ప్రయోగించడం.. ఫలితాన్ని అబ్జర్వ్ చేయడం అంతిమంగా.. తయారీకి అనుమతులు రావడం ఇవన్నీ అనుకున్న రీతిలో జరుగుతాయని ఆశిస్తే .. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి టీకా రావచ్చునని అంచనా వేస్తున్నారు. అప్పటిదాకా అందరూ జాగ్రత్తగా ఉండడం ఒక్కటే నియంత్రణకు మార్గం అనుకుంటున్నారు.