దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఇంకా నమోదవుతునే ఉన్నాయి. రేపు.. మాపు వ్యాక్సిన్ వస్తుందంటూ పలు ఫార్మా కంపెనీలు మొదటి నుంచి చెబుతునే ఉన్నా ఇప్పటికీ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాని పరిస్థితి. మరోపక్క కరోనా వ్యాక్సిన్ రావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండేళ్లు కూడా పట్టే అవకాశం లేకపోలేదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఎన్నికల హామీగా కరోనా టీకా..
అయితే ప్రస్తుత పరిస్థితుల మధ్య వ్యాక్సిన్ రాజకీయ అంశంగా మారింది. దీనిని ఎన్నికల హామీగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధోరణీ విదేశాల్లో ఉండేది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డోనాల్డ్ ట్రంప్ నవంబర్ కల్లా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల హామీని గుప్పించారు. అలాగే మన దేశంలోనూ తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో దీనిని ఎన్నికల అస్త్రంగా మలుచుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీహార్‌లో బీజేపీ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసేసింది కూడా.
ఇదే సమయంలో నెట్టింట తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.‘కేటీఆర్ సర్.. కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్‌ను మీరు ఇటీవల సందర్శించారు. ఆ సమయంలో కరోనా టీకాను తీసుకున్నారా? ఈ ప్రశ్నను నేను ఎందుకు అడుగుతున్నానంటే.. మీరు ప్రజల్లో ఎంతగా తిరుగుతున్న మీకు ఏమీ కావడంలేదు. దీనికి కారణమేమైన ఉందా?’ అని ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన కేటీఆర్ ‘అటువంటిదేమీ లేదు.. నేను కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోలేదు. వ్యాక్సిన్‌ను బీహార్ కోసమే రిజర్వ్ చేశారట’ అని వ్యాఖ్యానించారు. ఈయన చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెటిజన్ చెప్పినట్లుగానే కేటీఆర్.. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పర్యటనలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఒకరిద్దరు మంత్రులు, కొంతమంది నాయకులు మాస్కులు లేకుండా కనిపిస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం మాస్కులేకుండా ఎక్కడా కనిపించరు. తను కరోనా నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తుండటంతోనే కరోనాకు ధీటుగా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.