మార్కెట్ అంటే జనం ఉండేది అనే అర్థం. ఇప్పుడా మార్కెట్ కాస్తా డిజిటల్ మయం అయిపోయింది. జనమంతా ఈ డిజిటల్ మార్కెట్లోనే ఉంటున్నారు.
సినిమా కూడా ఇప్పుడీ మార్కెట్లోనే చేరిపోయింది. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ అనే పదం వచ్చి చేరింది. దాన్నే ఇప్పుడు మనం ఓటీటీ అనే పేరు పెట్టాం. సినిమా అనే మాయాబజార్ చివరికి ఓటీటీ గుప్పెట్లో చేరుతుందా? మరేదైనా మార్గముందా?.. ఇవన్నీ ఇప్పుడు మనముందున్న ప్రశ్నలే. ఈ ఓటీటీ ల ఫ్లాట్ ఫారాల మధ్య ఇప్పుడు గట్టిపోటీ కూడా నెలకొంది. అమెరికాలో ప్రారంభమైన ఓటీటీ మార్కెట్ ఇప్పుడు ప్రాంతాయ భాషలకూ చేరిపోయింది. కరోనా వచ్చాక ప్రతి నోటా ఓటీటీ జపమే.
ఎక్కడ మొదలైందంటే..
ఇలాంటి టెక్నాలజీలు మొట్టమొదట ప్రారంభమయ్యేది అమెరికా మార్కెట్లోనే. ఈ ఘనత నెట్ ఫ్లిక్స్ కే చెందుతుందని చెప్పాలి. బీజం పడింది అక్కడి నుంచే. 2007 వరకూ నెట్ ఫ్లిక్స్ డీవీడీ మార్కెట్లో ఉండేది. ఓ వెబ్ సైట్ ఈ డీవీడీల వ్యాపారానికి వేదికగా ఉండేది. 2007లో అది ఓటీటీగా రూపాంతరం చెందింది. నెట్ ఫ్లిక్స్ ను చూశాక ఇండియన్ మార్కెట్ కూ అలాంటి ఆలోచన వచ్చింది. అలా 2008 లో ఇక్కడ బిగ్ ఫ్లిక్స్ పురుడుపోసుకుంది. అలా ఒక్కొటొక్కటిగా ఓటీటీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం మన దేశంలో అమెజాన్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఊట్, జీ 5 తదితర సంస్థల హవా చెల్లుబాటవుతోంది.
ఎవరు నంబర్ ఒన్?
ఓటీటీ సంస్థల మధ్య నంబర్ల గేమ్ మొదలైంది. మన దేశంలో హాట్ స్టార్ హవా కొనసాగుతోంది. 2018 నాటికి హాట్ స్టార్ కు 18 కోట్ల యూజర్లు ఉన్నారు. దీని డౌన్ లోడ్లు కూడా 35 కోట్ల వరకూ ఉన్నాయి. 2019లో డిస్నీప్లస్ మొదటిసారిగా 2019 నవంబర్ లో డిస్నీ ప్లస్ మొదటగా అమెరికా, కెనడా, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో లాంచ్ అయింది. యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియాల్లో ఈ ఏడాదిలో ప్రారంభించారు. మనదేశంలోనూ ఈ ప్రసారాలు ప్రారంభమయ్యాయి.
త్వరలో ఫ్రాన్స్, మొనాకో, బెల్జియం, డెన్మార్క్, ఫిన్ లాండ్, ఐస్ ల్యాండ్, నార్వే, పోర్చుగల్, స్వీడన్ దేశాల్లో డిస్నీప్లస్ చేరువైంది. అమెజాన్ ప్రైమ్ వచ్చాక భారతీయ మార్కెట్లో ఓటీటీల మధ్య పోటీ ఎక్కువైంది. నెట్ ప్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్ ల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. హాట్ స్టార్ కు డిస్నీ తోడవడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గా కొత్త అవతారమెత్తింది. తాజా పరిస్థితులు ఏమిటంటే మార్వెల్, స్టార్ వార్స్ అభిమానులు ఇప్పుడు డిస్నీ ప్లస్ కు అదనపు బలమై కూర్చున్నారు. వీరి కామిక్స్ అన్నీ ఇకపై డిస్నీ ప్లస్ లోనే కనిపించనున్నాయి.
అభిమానులు ఇష్టపడే ఆ పాత్రలన్నీ హాట్ స్టార్ యూజర్లకు కనువిందు చేయబోతున్నాయి. వాల్ట్ డిస్నీ కూడా ప్రత్యేకంగా సిరీస్ రూపొందిచే పనిలో ఉంది. దీనికి తోడు సిసలైన విప్లవానికి డిసెంబరులో మార్వెల్ తెరతీయనుంది. మార్వెల్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘వాండావిజన్’ డిస్నీప్లస్ లో డిసెంబరు నుంచి స్ట్రీమింగ్ కానుంది. డిస్నీతో జతకట్టాక మార్వెల్ నెట్ ఫ్లిక్స్ కు రామ్ రామ్ పాడేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో డిస్నీ ప్లస్ హవా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
డిస్నీ పాత్ర ఎంత?
హాట్ స్టార్ లో అధిక శాతం వాటాలను డిస్నీ కొనుగోలు చేసింది. డిస్నీ కంటెంట్ అంతా హాట్ స్టార్ తో కలిసిపోయింది. ఈ కంటెంట్‌లో మార్వెల్ సినీమాటిక్ యూనివర్స్, డిస్నీ, పిక్సార్, నేషనల్ జియోగ్రాఫిక్, ఫ్రాంచైజీ స్టార్ వార్స్ లాంటి వీడియో కంటెంట్ తోడైంది. ఈ ప్రసారాలు ప్రారంభమైతే డిస్నీప్లస్ దూసుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డిస్నీప్లస్‌లో ఇప్పుడు 28.6 మిలియన్ల యూజర్లు ఉన్నారని సమాచారం. డిస్నీ ప్లస్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ పెరిగేకొద్దీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వెనుకబడిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని ఈ సంస్థలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. ఇవి కాకుండా ప్రాంతీయ ఓటీటీలు కూడా ఉన్నాయి. కానీ ప్రాంతీయ చిత్రాల మీద అమెజాన్ కన్నేసింది. దాంతో ఆహా లాంటి ఓటీటీ వేదికలు అమెజాన్ తో పోటీ పడటం కష్టం. ఓటీటీ సంస్థల మధ్య ఈ పోటీ ఎలాంటి పరిణామలకు దారితీస్తుందో వేచి చూడాలి.
– హేమసుందర్ పామర్తి











