(తిరుపతి నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఎస్సీలకు రిజర్వు అయిన ఈ స్థానం నుంచి వైసీపీ తరఫున గెలిచిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, కరోనా కారణంగా మరణించడంతో.. ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఎప్పుడు ఉప ఎన్నిక జరిగేదీ క్లారిటీ లేదు. కొంత మంది 2021లో జరగవచ్చుననే అంచనాలతో ఉండగా, మరికొందరు బీహార్ లో ఎన్నికలు నిర్వహించే సమయానికి ఇక్కడ కూడా ఉప ఎన్నిక పెట్టేస్తారనే అంచనా వేస్తున్నారు.
సహజంగా సిటింగ్ ప్రజాప్రతినిధి అకాలమరణం పాలైనప్పుడు.. జరిగే ఉప ఎన్నికలో పోటీకి దించకుండా ప్రధాన పార్టీలు ఒక అప్రకటిత ఒప్పందాన్ని పాటిస్తున్నాయి. అలాంటి ఒప్పందం సాధారణంగా ఈ ఎన్నికలకు కూడా వర్తించాలి. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.
మంగళవారం జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో బీజేపీ- జనసేన కూటమి పోటీచేస్తుందని ఆ పార్టీ ప్రకటించింది. మిగిలిన పార్టీల సంగతి ఇంకా తేలలేదు గానీ.. బీజేపీ- జనసేన కూటమి బరిలో ఉంటుందని ఖరారైనట్లే.
బరిలోకి దిగబోయేది ఎవరు..
ఉపఎన్నికకు ఆ కూటమి సిద్ధమైన సంగతి బాగానే ఉంది. మరి పోటీచేసే అభ్యర్థి ఏ పార్టీనుంచి ఉంటారు అనేది కీలకం. బీజేపీ అభ్యర్థి ఉంటారా? జనసేన అభ్యర్థి ఉంటారా? అనే మీమాంసలో పవన్ కల్యాణ్ దళానికే కాస్త పైచేయి ఉంది. నిజానికి ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి కూడా కొంత బలం ఉన్నట్లే అంచనా వేసుకోవాలి. గతంలో ఒక పర్యాయం తిరుపతి ఎంపీ స్థానాన్ని ఆ పార్టీ గెలుచుకుంది కూడా. కాకపోతే అప్పట్లో తెలుగుదేశంతో పొత్తులో ఉన్నారు.
కానీ, ఆ తర్వాత బీజేపీ బలం తగ్గిపోయింది. ఇప్పుడు నామమాత్రంగా కూడా లేదు. ఎంపీ స్థానం పరిధిలో చెప్పుకోదగ్గ నాయకులు కొందరు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, కోలా ఆనంద్ లాంటి వారున్నారు గానీ.. వారు ఏకంగా ఎంపీని గెలిపించగలరా? అనేది అనుమానమే. ఆ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే.. గత ఎంపీ ఎన్నికల్లో వారికి అక్కడ అభ్యర్థి కూడా లేరు.
అలాంటి పరిస్థితుల్లో తమ కూటమి బరిలో ఉంటుందని చెప్పినంత మాత్రాన ఆ పార్టీ రంగంలోకి దిగుతుందని కాదు. మెజారిటీ అవకాశం జనసేనకే దక్కుతుంది. పైగా కులం పరంగా కూడా స్థానికంగా బలిజ గా పరిగణనలో ఉన్న కాపువర్గం తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి లాంటి నియోజకవర్గాల్లో సంఖ్యాపరంగా ఎక్కువ. బలిజ లు అందరూ.. కులంపరంగా బీజేపీ కంటే జనసేననే తమ సొంత పార్టీగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో జనసేనకే కాస్త మెరుగైన అవకాశాలుంటాయి.
గెలుపు అంత వీజీ కాదు..
ఈ ఉప ఎన్నికలో కమల కూటమి పోటీచేయవచ్చు గానీ.. గెలుపు అంత ఈజీ కాదు. బల్లి దుర్గా ప్రసాద్ ఈ నియోజకవర్గానికి స్థానికుడు. బయటినుంచి వచ్చి పోటీచేసిన వ్యక్తి కాదు. అదే ఎంపీ నియోజకవర్గం పరిధిలో గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు. మంత్రిగా కూడా పనిచేశాడు. పైగా కరోనాతో చనిపోయాడు. అలాంటప్పుడు ఆయన కుటుంబం పట్ల ఆయన సొంత నియోజకవర్గంలో ఖచ్చితంగా చాలా సానుభూతి ఉంటుంది. ఆయన కుటుంబసభ్యులకే టికెట్ దక్కడం కూడా గ్యారంటీ. వారు మళ్లీ విజయం సాధించడానికి ఇదొక స్పష్టమైన కారణంగా కాగా, గత ఎన్నికల ఫలితాలు కూడా గమనించాల్సి ఉంది.
2019లో వైఎస్సార్ కాంగ్రెస్ ఇక్కడ దాదాపు 2.25 లక్షల ఓట్ల తేడాతో నెగ్గింది. ఇదేమీ సామాన్యమైన విజయం కాదు. వైకాపాకు చెందిన బల్లి దుర్గాప్రసాదరావుకు 7,22,877 ఓట్లు రాగా, తెలుగుదేశానికి చెందిన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు మాత్రమే లభించాయి. జనసేన మద్దతుతో పోటీచేసిన బీఎస్పీ అభ్యర్థికి 21 వేల ఓట్లు కూడా రాలేదు. ఇలాంటి నేపథ్యంలో.. ఈసారి సానుభూతి పవనాలు కూడా తోడైనప్పుడు కమలకూటమి నెగ్గడం అంత వీజీ కాదు.
పవన్ ఫోకస్ పెడితే ఎలా ఉంటుంది?
గత ఎన్నికల మాదిరిగా రాష్ట్రమంతా పర్యటించాల్సిన అవసరం లేదు. జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతి మీద గట్టిగా ఫోకస్ పెడితే పరిస్థితి మరోరకంగా ఉండవచ్చు. అయితే అభ్యర్థుల ఎంపిక వారికి కూడా క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఉప ఎన్నిక జరిగే సమయానికి ఇంకా ఎవరెవరు బరిలో ఉంటారనే విషయం మీద ఫలితం ఆధారపడి ఉంటుంది.